Telugu Gateway
Andhra Pradesh

నారా లోకేష్ శాఖలో మరో భారీ స్కామ్

నారా లోకేష్ శాఖలో మరో భారీ స్కామ్
X

64 కోట్ల రూపాయల భూమి 8 కోట్లకే

అస్మదీయ సంస్థకు అప్పనంగా అప్పగింత

ఎవరేమి అంటే మాకేంటి?. మా దోపిడీ మాదే అంటున్నది ఏపీ సర్కారు. విశాఖపట్నంలో వందల కోట్ల రూపాయల విలువైన భూములను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు అడ్డగోలుగా కేటాయించిన నారా లోకేష్ సారధ్యంలోని ఐటి శాఖ ఇప్పుడు అలాంటిదే మరో అడ్డగోలు కేటాయింపునకు దిగింది. ఏకంగా 64 కోట్ల రూపాయల విలువ చేసే 16 ఎకరాల భూమిని కేవలం 8 కోట్లకే ధారాదత్తం చేసింది. అంతే కాదు..ఆ కంపెనీ కల్పించే ప్రతి ఉద్యోగానికి 50 వేల రాయితీ ఇవ్వటంతోపాటు...ఆ కంపెనీ నియమించుకునే ఉద్యోగుల నియామక, శిక్షణా సాయం కూడా సర్కారు అందించనుంది. పోనీ సర్కారు అమరావతిలో భూమి కేటాయించింది ఏమైనా దేశంలోనే పేరు మోసిన ఐటి కంపెనీయా అంటే అదీ కాదు. పోనీ ఈ సంస్థ ఏమైనా సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ రంగంలో పేరుగాంచిందా?. అంటే అదేమీ లేదు. కేవలం డాటా ప్రాసెసింగ్ కార్యకలాపాలు నిర్వహించే కార్వీ డాటా మేనేజ్ మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ కు సర్కారు ఈ కేటాయింపులు చేసింది.

అమరావతిలో 390 కోట్ల రూపాయల పెట్టుబడితో కంపెనీ మెగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిందని..ఆ సంస్థ 10 వేల ఉద్యోగాలు కల్పిస్తుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏ కోణంలో చూసినా కార్వీ డాటా మేనేజ్ మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ కు 16 ఎకరాల భూ కేటాయింపు అడ్డగోలు వ్యవహారమే అని ఐటి శాఖ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఈ సంస్థకు ఐదెకరాలు కేటాయించటమే చాలా ఎక్కువని..అలాంటిది ఏకంగా 16 ఎకరాలు కేటాయించటం ఏమిటని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్ కూడా ఆయా కంపెనీల సత్తా..అవసరాలు ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా సర్కారు పెద్దలు చెప్పిన దానికి సై అంటున్నారని ఆ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇదే కార్వీ సంస్థ ఏపీలో కాల్ సెంటర్లను నిర్వహిస్తూ సర్కారు ఖజానాకు భారీ ఎత్తున కన్నం పెడుతుందనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ పనుల అప్పగింతలో కూడా భారీ గోల్ మాల్ జరిగిందని ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి.

Next Story
Share it