Telugu Gateway
Politics

‘అమరావతి’ అంచనాలపై థర్డ్ పార్టీ విచారణ..అంతా జైలుకే!

‘అమరావతి’ అంచనాలపై థర్డ్ పార్టీ విచారణ..అంతా జైలుకే!
X

అది అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) కావొచ్చు. ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (ఏపీసీఆర్ డీఏ) కావొచ్చు. అడ్డగోలు అంచనాలు..అంతులేని అవినీతి. ఇప్పుడు ఈ రెండు సంస్థల్లో వేల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. సాక్ష్యాత్తూ ఒక్క ఐకానిక్ బ్రిడ్జిలోనే 500 కోట్ల రూపాయలపైనే అవినీతికి పాల్పడ్డారంటే..మరి ఇప్పుడు సాగుతున్న 50 వేల కోట్ల రూపాయల పైబడిన పనుల్లో అవినీతి ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. రహదారులు ఏంటి?. భవనాలు ఏంటి?.చివరకు మొక్కల్లో కూడా కక్కుర్తి పడి దోచుకుంటున్నారు. అమరావతిలో చేపట్టిన భవనాలు, రోడ్లతో పాటు ఇతర పనులకు సంబంధించిన అంచనా వ్యయాలను థర్డ్ పార్టీతో మదింపు చేయిస్తే ఇందులో భాగస్వాములు అయిన వారంతా జైలుకు వెళ్ళాల్సి ఉంటుందని ఓ ఉన్నతాధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ మాత్రం పద్దతులు పాటించకుండా..ఇష్టానుసారం ఎవరికి తోచినట్లు వారు నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల సొమ్మును దోపిడీ చేసుకోవటమే లక్ష్యం అన్నట్లు అక్కడ అంచనాల పెంపు సాగుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. తాత్కాలిక రాజధాని భవనాల నిర్మాణం దగ్గర నుంచి ప్రతి పనిలోనూ ఇదే దందా సాగుతుందని చెబుతున్నారు. సహజంగా ప్రభుత్వం చెప్పినట్లుగా కాంట్రాక్టర్లు పనిచేయాలి.

కానీ సీఆర్ డీఏ, ఏడీసీలో కాంట్రాక్టర్లు చెప్పిన చందంగా ప్రభుత్వం పని చేస్తోంది. అంతే కాదు..పేరుకే టెండర్లు. వేల కోట్ల రూపాయల పనులు అయినా పంపకాలే. ప్రభుత్వ పెద్దలు ఎవరికి ఏ పని ఇవ్వాలనుకుంటే అలాగే ఆ పని వారికే దక్కుతుంది. అలా ‘సెట్’ చేశారు అంతా. వేలాది కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే పనులకు సహజంగా ముందు ఆర్థిక శాఖ అనుమతి తీసుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. కానీ అంతా అయిపోయిన తర్వాత టెండర్ల కేటాయింపు పూర్తయిన తర్వాతే ఆర్థిక శాఖకు అనుమతి కోసం పంపుతున్నారు. అదేమి అంటే..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం. ఆయన ఆదేశాల మేరకే చేశామని చెబుతున్నారు. మరి సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రే తన ప్రభుత్వ నిబంధనలను తానే ఉల్లంఘించవచ్చా?. ముఖ్యమంత్రికి నిబంధనలు వర్తించవా?. ఆయన తనకు తోచినట్లు ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ప్రభుత్వాన్ని నడపవచ్చా?. అని మౌలికసదుపాయాల శాఖలోని అదికారి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం కనుక వస్తే అమరావతి, ఏడీసీప పనుల విషయంలో చాలా మంది ఇబ్బంది పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

Next Story
Share it