Telugu Gateway
Latest News

మోడీ స‌ర్కారుకు షాక్..ఆర్ బిఐ గ‌వ‌ర్న‌ర్ రాజీనామా

మోడీ స‌ర్కారుకు షాక్..ఆర్ బిఐ గ‌వ‌ర్న‌ర్ రాజీనామా
X

సంచ‌ల‌నం. స‌ద్దుమ‌ణిగిన‌ట్లుగానే క‌న్పించిన రిజ‌ర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఆర్ బిఐ) వివాదం ఒక్క‌సారిగా మ‌ళ్లీ బ‌య‌ట‌ప‌డింది. ఏకంగా ఆర్ బిఐ గ‌వ‌ర్న‌ర్ ఊర్జిత్ ప‌టేల్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌టంతో ఒక్క‌సారిగా అంద‌రూ షాక్ కు గుర‌య్యారు. ఎప్ప‌టి నుంచో ఈ వార్త‌లు వ‌స్తున్నా అంతా సెట్ అయింద‌ని భావించారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఉర్జిత్ ప‌టేల్ వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇది మంగ‌ళ‌వారం నాడు స్టాక్ మార్కెట్ పై తీవ్ర ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంది. అంతే రాజ‌కీయంగా కూడా ఇది మోడీ స‌ర్కారుకు ఇది పెద్ద ఎదురుదెబ్బ‌గా మారే అవ‌కాశం క‌న్సిస్తోంది. మాజీ ఆర్ బిఐ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘ‌రామ‌రాజ‌న్ తోనూ మోడీ స‌ర్కారుకు పొస‌గ‌లేదు. పెద్ద నోట్ల రద్దు నిర్ణ‌యాన్ని ఆయ‌న బ‌హిరంగంగా త‌ప్పుప‌ట్టారు. గత కొద్దిరోజులుగా దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలక విధాన నిర్ణయాలపై కేంద్ర ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అనే రీతిలో తలపడుతూ వస్తున్న ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం.. పలువురిని ఆశ్చర్య పరుస్తోంది.

ఆర్ బిఐ గవర్నర్‌గా పనిచేసినందుకు గర్విస్తున్నానని పేర్కొన్న ఉర్జిత్‌.. పదవీకాలంలో తనకు సహకరించిన ఉద్యోగులు, ఆర్ బిఐ డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.2016 నుంచి ఆర్ బిఐ గవర్నర్‌గా కొనసాగుతున్న ఉర్జిత్‌ పటేల్‌ తన పదవీకాలం కన్నా చాలాముందే రాజీనామా చేశారు. 2019 సెప్టెంబర్‌ వరకు ఆయన పదవీకాలం ఉంది. ఉర్జిత్‌ పటేల్‌ హయాంలోనే పెద్దనోట్ల రద్దు వంటి తీవ్రమైన నిర్ణయాలను మోదీ సర్కారు తీసుకున్న సంగతి తెలిసిందే. తాము చెప్పినట్టు వినకుండా ఉర్జిత్‌ స్వతంత్రంగా వ్యవహరిస్తుండటం.. కేంద్రాన్ని తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. ఉర్జిత్‌ రాజీనామాను అస్త్రంగా చేసుకొని.. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు కేంద్రాన్ని ఇరకాటంలోకి నెట్టే అవకాశముందని స‌మాచారం.

Next Story
Share it