Telugu Gateway
Telangana

తెలంగాణలో పార్టీలకు పోలింగ్ పర్సంటేజ్ షాక్!

తెలంగాణలో పార్టీలకు పోలింగ్ పర్సంటేజ్ షాక్!
X

తెలంగాణ రాజకీయ పార్టీలకు ఇప్పుడు ఒకటే టెన్షన్. అనూహ్యంగా పెరిగిన ఈ పోలింగ్ పర్సంటేజ్ ఎవరికి అనుకూలం?. ఇది అంతా ప్రభుత్వ అనుకూల ఓటా? లేక వ్యతిరేరక ఓట్లా?. ఎవరూ ఊహించని స్థాయిలో తెలంగాణలో 73.20 శాతం పొలింగ్ నమోదు అయి రాజకీయ పార్టీలకు కంటి మీద కునుకులేకుండా చేసిందనే చెప్పొచ్చు. ఎగ్జిట్ పోల్స్ ను మించిన టెన్షన్ ను ‘తెలంగాణ పోలింగ్ పర్సంటేజ్’ కలిగించింది. ఇప్పుడు అందరి దృష్టి అసలు ఫలితాలు వెల్లడయ్యే డిసెంబర్ 11పైనే. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఉన్నా కూడా సానుకూల ఓటింగ్ ఇంతటి ప్రభావం చూపించటం కష్టం అనే అంచనాలు ఉన్నాయి. కేవలం వ్యతిరేక ఓటు ఉంటేనే పోలింగ్ శాతాల్లో ఇలాంటి అనూహ్య మార్పులు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సానుకూల ఓటుకు ఇంత తీవ్రత ఉండదని..వ్యతిరేక ఓటు ఉన్నప్పుడు మాత్రమే ఇంతటి మార్పు ఉంటుందని చెబుతున్నారు. అలా కాకుండా కేవలం సానుకూల ఓట్లతోనే ఇంతటి పోలింగ్ శాతం నమోదు అయితే ఇది దేశంలోనే ఓ రికార్డు కూడా అవుతుందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వానికి సానుకూల అంశాలు ఎన్ని ఉన్నాయో అంతకు మించి వ్యతిరేక అంశాలు కూడా ఉన్నాయి. అయితే ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపారు?. వ్యతిరేకత పనిచేసిందా? లేక సానుకూలతా? అన్న విషయం తేలాలంటే మాత్రం డిసెంబర్ 11 వరకూ ఆగాల్సిందే.

అయితే తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ వెల్లడించిన తుది పోలింగ్ శాతాలను పరిశీలించిన తర్వాత మాత్రం ప్రజల్లోనూ..రాజకీయ వర్గాల్లోనూ మరోసారి ఈ అంశంపై చర్చ మొదలైంది. ఈ భారీ ఓటింగ్ శాతం ఎవరి జాతకాలను మార్చుతుంది?. ఎవరి పుట్టి ముంచుతుంది అన్న టెన్షన్ లో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఎంత దుమారం రేపాయో...పోలింగ్ శాతం కూడా తెలంగాణ ప్రజల్లో ఎంతో ఉత్కంఠ రేపింది. తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో ఏకంగా 90 శాతం పైన..మరికొన్నింటిలో 88 శాతం వరకూ పోలింగ్ నమోదు కావటం ఆసక్తికర పరిణామంగా మారింది. తాజాగా వెల్లడైన తుది పోలింగ్ ఫలితాలతో రాజకీయ పార్టీలు మళ్ళీ కొత్త అంచనాలు ప్రారంభించాయి. మరి ఇవి అనుకూల పవనాలా?. లేక వ్యతిరేక పవనాలా?. తెలియాలంటే మంగళవారం వరకూ ఆగాల్సిందే.

Next Story
Share it