Telugu Gateway
Politics

మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యం!

మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యం!
X

గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారు మళ్ళీ తాము ఎప్పుడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తామా? అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటే..కొత్తగా మంత్రి పదవులు ఆశిస్తున్న వారు తమకు ఛాన్స్ దొరుకుతుందా? లేదా అన్న టెన్షన్ తో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఎదురుచూపులు ఇంకా చాలా కాలమే కొనసాగించాల్సిన పరిస్థితి కన్పిస్తోంది. ఎందుకంటే సీఎం కెసీఆర్ మంత్రివర్గ విస్తరణకు తొందరేమీలేదని తేల్చటంతో ఆశావహులు అందరిలో టెన్షన మరికొంత కాలం కొనసాగేలా ఉంది. సంక్రాంతి పండుగ వరకు విస్తరణ ఉండకపోవచ్చని భావిస్తున్నారు. సంక్రాంతి తర్వాతే మంత్రివర్గ విస్తరణ, శాసనసభ సమావేశాలు, ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల ఎన్నిక తదితర కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేయాలని యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

ఒకే స్వభావం కలిగిన శాఖలన్నింటినీ కలిపి ఒకే మంత్రిత్వశాఖ పరిధిలోకి తేవాలని కూడా సీఎం కేసీఆర్‌ యోచిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే అధికారులు కసరత్తు ప్రారంభించగా ఈ ప్రక్రియ ముగిశాక ఏ శాఖను ఎవరికి అప్పగించాలన్న దానిపై సీఎం నిర్ణయం తీసకోనున్నారు. మంత్రివర్గంలోకి తీసుకునే మంత్రుల సంఖ్య తక్కువగా ఉండే అవకాశమున్నందున మళ్లీ పార్లమెంటరీ కార్యదర్శుల అంశం తెరపైకి రానుంది. గతంలోనూ పార్లమెంటరీ కార్యదర్శులను నియమించినప్పటికీ కోర్టు నుంచి చుక్కెదురు కావడంతో ఈసారి న్యాయపరమైన అడ్డంకులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు సెక్రటరీలుగా ఎంత మందిని నియమించాలి? ఎవరిని నియమించాలి? స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ పదవులకు ఎవరిని ఎంపిక చేయాలి? లాంటి నిర్ణయాలన్నీ తీసుకున్న తర్వాత ఒకేసారి నియామకాలు జరపాలని సీఎం యోచిస్తున్నారు.

Next Story
Share it