Telugu Gateway
Telangana

జాతీయ ఛానల్స్ అన్నీ ఓ వైపు..లగడపాటి ఒక్కరే మరో వైపు

జాతీయ ఛానల్స్ అన్నీ ఓ వైపు..లగడపాటి ఒక్కరే మరో వైపు
X

అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన తెలంగాణ ఎన్నికలు పూర్తయినా కూడా ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎగ్జిట్ పోల్స్ కూడా పూర్తి క్లారిటీ ఇవ్వలేకపోయాయి. అయితే విచిత్రం ఏమిటంటే జాతీయ ఛానల్స్ అన్నీ తెలంగాణలో మళ్ళీ టీఆర్ఎస్ దే అధికారం అని చెప్పగా..అంచనాల్లో పక్కగా ఉండే లగడపాటి రాజగోపాల్ మాత్రం జాతీయ ఛానల్స్ కు భిన్నంగా తెలంగాణలో మహాకూటమిదే అధికారం అని తేల్చారు. తన అంచనాల్లో ఒక పది శాతం అటు..ఇటువైపు ఉండొచ్చని లగడపాటి వెల్లడించారు. లగడపాటి లెక్క ప్రకారం కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్‌ 55 నుంచి75 సీట్లు గెలుస్తందన్నారు. టీఆర్‌ఎస్‌కు కేవలం 25- 45 మాత్రమే వస్తాయన్నారు. కూటమిలో భాగంగా 13 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీకి 5-9 సీట్లు వస్తాయని, బీజేపీకి 5-9, ఎంఐఎం 6-7, ఇతరులు 5-9 సీట్లు గెలుస్తారని జోస్యం చెప్పారు. బీఎల్‌ఎఫ్‌ కూడా ఖమ్మంలో ఒక సీటు గెలిచే అవకాశం ఉందన్నారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఎగ్జిట్‌పోల్స్‌ అన్నీ తప్పయ్యాయని, కానీ తాను చెప్పిన జోస్యం మాత్రం నిజమైందని గుర్తు చేశారు.

జాతీయ ఛానల్స్ ఎగ్జిట్‌ పోల్‌ సర్వేల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఆధిక్యం కనబడుతోంది. ఇండియా టుడే సర్వే టీఆర్‌ఎస్‌కు భారీ ఆధిక్యం వస్తుందని అంచనా వేయగా.. న్యూస్‌ ఎక్స్‌ చానెల్‌ సర్వే హంగ్‌ అసెంబ్లీ రావొచ్చునని పేర్కొంది. రిపబ్లిక్‌ టీవీ సర్వే, పీపుల్స్‌ పల్స్‌ సర్వేలు కూడా టీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్‌కు మధ్య గట్టి పోటీ ఉందని పేర్కొన్నప్పటికీ.. కూటమి కన్నా టీఆర్‌ఎస్‌కే ఎక్కువ స్థానాలు వస్తాయని, సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా టీఆర్‌ఎస్సే నిలుస్తుందని అంచనా వేశాయి. సర్వేలన్నింటినీ కలుపుకుంటే.. తిరిగి అధికారంలోకి రావడానికి టీఆర్‌ఎస్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు తేలుతోంది. ఏదిఏమైనా ప్రజాతీర్పు అంతిమంగా ఏమిటన్నది రానున్న 11వ తేదీ స్పష్టం కానుంది. ఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించనుందని.. 79 నుంచి 91 స్థానాలు సాధించి.. తిరుగులేని మెజారిటీ సాధించనుందని అంచనా వేసింది. ఈ సర్వేలో కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్‌కు కేవలం 21 నుంచి 33 స్థానాలు, బీజేపీకి ఒకటి నుంచి మూడు స్థానాలు వస్తాయని పేర్కొంది.

ఈ సర్వేలో ఇతరులు నాలుగు నుంచి ఏడు స్థానాలు కైవసం చేసుకోనున్నారని తెలిపింది. టీఆర్‌ఎస్‌కు 46శాతం ఓట్లు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 46శాతం ఓట్లు వస్తాయని ఇండియా టుడే మై యాక్సిస్‌ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమికి 37శాతం ఓట్లు, బీజేపీకి ఏడుశాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. పాతబస్తీలో గట్టిపట్టు కలిగిన ఎంఐఎం మూడుశాతం ఓట్లు సాధిస్తుందని, ఇతరులు ఏడుశాతం ఓట్లు గెలుచుకుంటారని తెలిపింది.

అధికార టీఆర్‌ఎస్‌కు 66 స్థానాలు, ప్రజాఫ్రంట్‌కు 37 స్థానాలు, బీజేపీకి ఏడు స్థానాలు వస్తాయని టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌ పోల్స్‌ లో అంచనా వేసింది. ఇక, రిపబ్లిక్‌ టీవీ ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో టీఆర్‌ఎస్‌-ప్రజాకూటమి మధ్య హోరాహోరీ ఉన్నట్టు తేలింది. టీఆర్‌ఎస్‌కు 50 నుంచి 65 స్థానాలు, కాంగ్రెస్‌కు 38 నుంచి 52 స్థానాలు, బీజేపీకి నాలుగు నుంచి ఏడు స్థానాలు వస్తాయని రిపబ్లిక్‌ టీవీ పేర్కొంది. న్యూస్‌ ఎక్స్‌ సర్వే తెలంగాణలో హంగ్‌ అసెంబ్లీ వచ్చే అవకాశముందని పేర్కొంది. ఈ సర్వేలో టీఆర్‌ఎస్‌కు 57 స్థానాలు, కూటమికి 46, బీజేపీకి 6, ఇతరులకు 10 స్థానాలు వస్తాయని పేర్కొంది. ఇండియా టీవీ సర్వేలో 62 నుంచి 70 స్థానాలు టీఆర్‌ఎస్‌కు వస్తాయని, కూటమికి 33 నుంచి 41 స్థానాలు వస్తాయని, బీజేపీ 6-8, ఇతరులు 6-8 స్థానాలు గెలుపొందుతారని అంచనా వేసింది. ఆరా సంస్థ చేసిన సర్వేలో టీఆర్‌ఎస్‌కు 75-85 స్థానాలు, ప్రజాఫ్రంట్‌కు 25-35 స్థానాలు, బీజేపీకి 2-3 స్థానాలు, ఎంఐఎంకు 7-8 స్థానాలు, ఇతరులకు 0-3 స్థానాలు వస్తాయని పేర్కొంది. ఇక, పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్‌ సర్వేలో టీఆర్‌ఎస్‌కు 54-61 స్థానాలు, కాంగ్రెస్‌కు 40-48 స్థానాలు, టీడీపీకి 4-6 స్థానాలు, బీజేపీకి 3-5 స్థానాలు, ఎంఐఎంకి 6-8, ఇతరులు 5-7 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.

Next Story
Share it