Telugu Gateway
Telangana

ప్రతిపక్షాన్ని తుడిచిపెట్టారేంటో!

ప్రతిపక్షాన్ని తుడిచిపెట్టారేంటో!
X

సహజంగా ప్రభుత్వంలో ఉన్న వారిపై ఎవరికైనా కొంత అసంతృప్తి..కోపం ఉంటాయి. కానీ తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో విచిత్రంగా ప్రతిపక్షాన్ని తుడిచిపెట్టేసినట్లు ఫలితాలు రావటం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. టీఆర్ఎస్ గెలుపుపై పెద్దగా ఎవరూ ఆశ్చర్యపోకపోయినా..కాంగ్రెస్ నేతలు ఓటమి పాలు అయిన తీరు మాత్రం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి పూర్తి పట్టున్న జిల్లాల్లోనూ ఈ సారి ఊహించని ఫలితాలు వెల్లడయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో మహామహులుగా పేరున్న నేతలు అందరూ ఓటమి పాలయ్యారు. సాక్ష్యాత్తూ ఇటీవల వరకూ ప్రతిపక్ష నేతగా ఉన్న జానారెడ్డి మొదలుకుని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనర్సింహా, మాజీ మంత్రి డీ కె అరుణ , సునీతా లక్ష్మారెడ్డి. సర్వే సత్యనారాయణ, పద్మావతి తదితరులు అందరూ ఓటమి పాలయ్యారు. అధికార టీఆర్ఎస్ 88 సీట్లు దక్కించుకునేలా దూసుకెళుతోంది. పీపుల్స్ ఫ్రంట్ మాత్రం 21 సీట్లకు పరిమితం అయ్యే ఛాన్స్ కన్పిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ కు పాజిటివ్ ఓటు తెచ్చిపెట్టాయని అంచనాలు వెలువడుతున్నాయి. దీనికి తోడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫ్రంట్ పేరుతో తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించటం. కాంగ్రెస్ తో జట్టుకట్టి ప్రచారం చేయటం కెసీఆర్ కు లాభించింది. కెసీఆర్ తన సుడిగాలి ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చూసినా చంద్రబాబు గురించే ప్రస్తావించారు. ఆయనకు దున్నుకోవటానికి అక్కడ 175 నియోజకవర్గాలు ఉండగా..తెలంగాణ రాజకీయాలతో ఆయనకేమి పని?. అని కెసీఆర్ పదే పదే ప్రస్తావించారు. ఇది తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ ను రాజేసిందనే విషయం తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. దీనికితోడు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేలు...తొలుత టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉందని చెప్పి...తర్వాత మాట మార్చారని, కేవలం చంద్రబాబు ప్రోద్భలంతోనే ఇదంతా జరిగిందని మంత్రి కెటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల్లో తీవ్ర ప్రభావం చూపించినట్లు కన్పిస్తోంది. కారణం ఏదైనా అయిన కారు మాత్రం జోరుతో దూసుకెళ్ళగా..ప్రతిపక్షం మాత్రం బేజార్ కావాల్సి వచ్చింది.

Next Story
Share it