Telugu Gateway
Telangana

ఓటమి జాబితాలో ఐదుగురు మంత్రులు!

ఓటమి జాబితాలో ఐదుగురు మంత్రులు!
X

తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఇంకా ఎంతో సమయం లేదు. గంటల్లోనే తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయినా పార్టీల్లో టెన్షన్. అధికార టీఆర్ఎస్ కూడా ‘లెక్కల’ పనుల్లో బిజీగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు పూర్తి మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తామా? లేక ఎవరి మద్దతు అయినా తీసుకోవాల్సి ఉంటుందా? అన్న అంశంపై తర్జనభర్జనలు పడుతున్నారు. ఇప్పటికే అటు టీఆర్ఎస్, ఇటు కూటమి నేతలు కూడా గెలిచే అవకాశం ఉన్న ఇండిపెండెంట్లతో ‘టచ్’లో ఉన్నారు. ఇండిపెండెంట్లు అయినా..ఇతర పార్టీలు అయినా ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుందో వారివైపే మొగ్గుచూపుతాయి. అది సహజం కూడా. అయితే అధికార టీఆర్ఎస్ జిల్లాల వారీగా ఇప్పటికే గెలుపు గుర్రాల లెక్కలు తీసేపనిలో ఉంది. ఎవరెవరు గెలిచే అవకాశం ఉంది. ఎవరెవరు ఇంటి బాట పడతారు? అన్న అంచనాలు వేసుకుంటున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అంతర్గత అంచనాల ప్రకారం నాలుగు నుంచి ఐదుగురు మంత్రులు ఇంటి బాట పట్టడం ఖాయంగా కన్పిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

వీరందరూ కూడా హైదరాబాద్ కు అతి చేరువగా ఉన్న ప్రాంతాలకు చెందిన వారు కావటం విశేషం. దీంతో పాటు పక్కాగా ఓడిపోయే తాజా మాజీ ఎమ్మెల్యేల జాబితా ను కూడా సిద్ధం చేసుకున్నారు. దీని ప్రకారం సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో పది మందికిపైగా ఇంటి బాటే పట్టే అవకాశం ఉందని ఆ పార్టీ అంతర్గత అంచనాల్లో తేలింది. అయినా సరే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను దక్కించుకుంటామనే అంచనాలో టీఆర్ఎస్ ఉంది. మంగళవారం పదకొండు గంటలకల్లా...అత్యంత ఉత్కంఠ రేపిన తెలంగాణ అసెంబ్లీ ఫలితాలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా హామీల అమలు అంత సాఫీగా సాగదని..ఇప్పుడు సర్కారు తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Next Story
Share it