Telugu Gateway
Telangana

‘సింధు’ చరిత్ర

‘సింధు’ చరిత్ర
X

అనుమానాలు పటాపంచలు అయ్యాయి. ఫైనల్ ఫోబియా పారిపోయింది. తెలుగమ్మాయి సింధు కొత్త ‘చరిత్ర’ సృష్టించింది. ఇప్పటి వరకూ దేశంలో ఎవరూ సాధించని రికార్డును సింధు సొంతం అయింది. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ టైటిల్ విజేతగా నిలిచి సంచలన విజయం నమోదు చేసుకుంది. ఈ టూర్ ఫైనల్లో రెండో సీడ్ జపాన్ కు చెందిన ఒకుహర పై సింధు అద్భుతమైన పోరాటంతో విజయం దక్కించుకుంది. అత్యంత రసవత్తరంగా సాగిన పోరులో విజయం సాధించి టైటిల్ దక్కించుకుంది. గత ఏడాది ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన సింధు.. ఈ ఏడాది టైటిల్‌ను సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా ‍క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సింధు 21-19, 21-17 తేడాతో విజేతగా అవతరించింది. మరొకవైపు ఈ ఏడాది లోటుగా ఉన్న అంతర్జాతీయ టైటిల్‌ను గెలిచి సీజన్‌ను సగర్వంగా ముగించి కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలకటానికి రెడీ అయింది. తొలి గేమ్‌లో సింధు 14-6 తేడాతో ఆధిక్యంలో ఉన్న దశలో ఒకుహారా పుంజుకుంది. వరుసగా నాలుగు పాయింట్లు సాధించి సింధు ఆధిక్యాన్ని తగ్గించింది.

ఆ తర్వాత ఒకుహారా రెండు పాయింట్లు సాధించగా, సింధు పాయింట్‌ మాత్రమే సాధించింది. ఈ దశలో ఒకుహారీ నాలుగు పాయింట్లు సాధించగా, సింధు పాయింట్‌ దక్కించింది. దాంతో స్కోరు 16-16 గా సమం అయ్యింది. అటు తర్వాత జోరు పెంచిన సింధు వరుస పాయింట్లతో సత్తా చాటింది. తొలుత ఒక పాయింట్‌ సాధించి ఆధిక్యం సాధించిన సింధు.. వరుసగా రెండు స్మాష్‌లతో ముందంజ వేసింది. అదే జోరును తిరిగి కొనసాగించడంతో తొలి గేమ్‌ను సింధు దక్కించుకుంది. రెండో గేమ్‌లో సింధు 3-0 తో పైచేయి సాధించింది. ఆపై సింధు రెండు పాయింట్లు, ఒకుహారా నాలుగు పాయింట్లు సాధించడంతో ఇరువురు మధ్య వ్యత్యాసం తగ్గింది. కాకపోతే సింధు మరోసారి విజృంభించి ఆధిక్యాన్ని సాధించింది. రెండో గేమ్‌లో ఎక్కడ ఆధిక్యాన్ని కోల‍్పోకుండా వచ్చిన సింధు చివరకు మ్యాచ్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా టైటిల్‌ను సాధించింది. అంతే సింధుకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story
Share it