Telugu Gateway
Telangana

టీఆర్ఎస్ పేకమేడలా కూలటం ఖాయం

టీఆర్ఎస్ పేకమేడలా కూలటం ఖాయం
X

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణలో పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కొడంగల్ లో మీడియాతో మాట్లాడారు. ఆయన మరోసారి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ఫలితాలతో టీఆర్ఎస్ పేకమేడలా కూలిపోవటం ఖాయం అని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటంలో కెసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు ప్రజలకు, కేసీఆర్ కుటుంబానికి మధ్య జరిగాయన్న ఆయన.. కేసీఆర్ మోసపూరిత పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారని... సచివాలయానికి వెళ్లని సీఎంగా కేసీఆర్ నిలిచారని వ్యాఖ్యానించారు. భస్మాసుర హస్తం మాదిరిగా తన చేయిని తన నెత్తిపై కేసీఆర్ పెట్టుకున్నారని విమర్శించారు. ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ వెంట పార్టీ ఫిరాయింపుదారులు, కొంతమంది నేతలు, కాంట్రాక్టర్లు మాత్రమే నిలబడ్డారని వ్యాఖ్యానించారు.

కెసీఆర్ అహంకారపూరిత వైఖరి, నమ్మించే మోసం చేసే నైజాన్ని ప్రజలు ఏ మాత్రం హర్షించలేదన్నారు. కేసీఆర్ కోసం ఆనాడు అమరవీరుల కుటుంబాలు, నిరుద్యోగ యువత, దళితులు, గిరిజనులు, యావత్ తెలంగాణ అందరూ ఏకమై పార్టీని కాపాడుకున్నారని.. కానీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత అహంకారంతో కేసీఆర్ ఏకపక్షంగా వెళ్లారని ఆరోపించారు. తెలంగాణ సమాజం ఆధిపత్య ధోరణిని అసలు సహించదని రేవంత్ అన్నారు. పాలనను గాలికి వదిలివేసి.. అయితే ఫాంహౌజ్ లోనో.. లేకుంటే సొంత వ్యవహారాల్లోనో ..ఉండటం వల్ల.. పాలన అస్తవ్యస్తమైందని తెలిపారు. ప్రిన్సిపాల్ సెక్రటరీలు కూడా సచివాలయానికి రావడం మానేశారని చెప్పారు. వారి కింద పనిచేసే సిబ్బంది కూడా రాకపోవటంతో సచివాలయం కోమాలోకి వెళ్లిపోయిందని విమర్శించారు.

Next Story
Share it