Telugu Gateway
Politics

రేవంత్ రెడ్డి ఓటమి

రేవంత్ రెడ్డి ఓటమి
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ షాక్ లే. కారు జోరులోనూ ఓటమి పాలైన మంత్రులు కొందరైతే..గెలుపు గ్యారంటీ అనుకున్న వారూ ఓటమి పాలయ్యారు. తొలి నుంచి కొడంగల్ లో పోటీ తీవ్రంగా ఉంటుందని భావించినా..అతి తక్కువ మెజారిటీతో అయినా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గెలుస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో 9500 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఇది ఖచ్చితంగా ఆయనకు షాక్ లాంటిదే. కాంగ్రెస్ తరపున పలు నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేశారు. కానీ చివరకు ఆయనే ఓటమి పాలయ్యారు. దీంతో ఎలాగైనా రేవంత్ రెడ్డిని అసెంబ్లీలోకి అడుగుపెట్టనీయకుండా చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కెసీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు అయింది.

కాంగ్రెస్ కీలక నేతలకు చెందిన నియోజకవర్గాలపై టీఆర్ఎస్ అధిష్టానం ‘ప్రత్యేక ఫోకస్’ పెట్టి మరీ టార్గెట్ రీచ్ అయిందనే చెప్పొచ్చు. కొడంగల్ లో తనను ఓడించటం మంత్రులు హరీష్ రావు, కెటీఆర్ లే కాదు కదా స్వయంగా కెసీఆర్ వచ్చినా ఏమీ చేయలేరని రేవంత్ రెడ్డి సవాళ్ళు విసిరారు. కెసీఆర్ సభ రోజు అరెస్టుతో సెంటిమెంట్ కారణంగా రేవంత్ రెడ్డి విజయం సాధిస్తారని ప్రచారం జరిగింది. చివరకు అరెస్టు కూడా ఆయన్ను కాపాడలేకపోయింది. రేవంత్ రెడ్డితోపాటు సీనియర్ నేతలైన జానారెడ్డి , మాజీ మంత్రి డీ కె అరుణ , నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆందోల్ లో దామోదర్ రాజనర్సింహా, సునీతా లక్ష్మారెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా ఓటమి పాలయ్యారు.

Next Story
Share it