Telugu Gateway
Telangana

తెలంగాణలో ‘విచిత్ర రాజకీయం’

తెలంగాణలో ‘విచిత్ర రాజకీయం’
X

ఎన్నికలు పూర్తయ్యాక కూడా తెలంగాణలో విచిత్ర రాజకీయం నడుస్తోంది. పరిపాలనపై దృష్టి సారించాల్సిన అధికార పార్టీ ఇప్పుడు పూర్తిగా ‘ఫిరాయింపుల’ఫైనే ఫోకస్ పెట్టినట్లు కన్పిస్తోంది. అందుకే ఇంకా మంత్రివర్గం ఏర్పాటు పూర్తి కాలేదు. ఎప్పుడు పూర్తి అవుతుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్న వారికి..సీనియర్ నేతకు తెలియదు. ఇఫ్పుడు ఫోకస్ అంతా ‘టార్గెట్ విపక్షాలు’ అన్నట్లే సాగుతుంది. 19 సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీతోపాటు..రెండు సీట్లు దక్కించుకున్న టీడీపీలోనూ చీలికలు రావటం ఖాయంగా కన్పిస్తోంది. మరి మంత్రి పదవులు డిమాండ్ చేస్తున్న విపక్ష ఎమ్మెల్యేల డిమాండ్లను ఆమోదిస్తే..సొంత పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి?. గత ఎన్నికల్లో ఓడిపోయిన చోట కూడా టీఆర్ఎస్ అభ్యర్దులు ‘మేమే ఎమ్మెల్యేలు’గా వ్యవహరిస్తాం అని బహిరంగంగా ప్రకటనలు ఇఛ్చారు. మరి ఓడిపోయిన వారు ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తాం అంటే...గెలిచిన వారు ఏమి చేస్తారు.

ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవని ఓ సీనియర్ రాజకీయ నేత వ్యాఖ్యానించారంటే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఓ వైపు మండలిలో కాంగ్రెస్ పక్షాన్ని విలీనం చేసిన అంశాన్ని ఆ పార్టీ కోర్టులో సవాల్ చేసేందుకు సిద్ధం అవుతోంది. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత లేఖ లేకుండా కేవలం సభ్యులతో ఓ లేఖ ఇఫ్పించి..అదే శాసనసభాపక్ష నిర్ణయం అని చెప్పటం..ఆ లేఖ ఆధారంగా మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ విలీన తీర్మానాన్ని ఆమోదిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయటంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఫిరాయింపులు కొత్తేమీ కాకపోయినా గతంలో ఎప్పడూ ఇంత దారుణంగా రాజకీయ పరిస్థితులు లేవని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మరెన్ని వింతలు..విశేషాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it