Telugu Gateway
Telangana

ఈవీఎంల మాక్ పోలింగ్ బటన్ ‘క్లియర్’ చేయలేదా?

ఈవీఎంల మాక్ పోలింగ్ బటన్ ‘క్లియర్’ చేయలేదా?
X

తెలంగాణలో ఎన్నికల నిర్వహణ ఈ సారి అస్తవ్యస్థంగా మారింది. ఓటర్ల జాబితాలో అక్రమాలు మొదలుకుని..ఎన్నికల నిర్వహణ వరకూ ఎలక్షన్ కమిషన్ ఘోరంగా విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ఓ సందేశం వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సారి కొత్తగా ఈవీఎంలకు వీవీప్యాట్ మెషీన్లు కూడా జత చేశారు. ఓటు వేసిన అభ్యర్ధి తాను వేసిన ఓటు అదే పార్టీకి పడుతుందా? లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు వీలుగా ఈ ఏర్పాట్లు చేశారు. అయితే ప్రతి బూత్ లోనూ పోలింగ్ కు ముందు సిబ్బంది ‘మాక్ పోలింగ్’ నిర్వహించారు. ఇది ముగిసిన తర్వాత మాక్ పోలింగ్ క్లియర్ బటన్ ను నొక్కి పోలింగ్ ను ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ చోట్ల మాక్ పోలింగ్ క్లియర్ బటన్ నొక్కకుండానే పోలింగ్ ప్రారంభించటం వల్ల..నమోదు అయిన ఓట్లకు..ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లకు మధ్య తేడా వచ్చింది. ఈ విషయాలను కొంత మంది ఈసీఐ దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో ఈసీఐ దీనిపై వివరణ కోరుతూ ఇలాంటి సంఘటనలు నమోదు అయిన పోలింగ్ స్టేషన్ల వివరాలను అందజేయాలని ఆదేశించింది.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా, రిటర్నింగ్ ఆపీసర్ నివేదికతో జాబితా పంపాలని ఆదేశించారు ఈ నివేదిక అందిన తర్వాతే కౌంటింగ్ కు అనుమతిస్తామని పేర్కొన్నారు. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. గతంలో ఎన్నో ఎన్నికలు జరిగినా ఏ ముఖ్య ఎన్నికల అధికారి బద్నాం కాని స్థాయిలో రజత్ కుమార్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో పోలింగ్ ముగిసిన 29 గంటల తర్వాత కానీ రాష్ట్రమంతటా తుది పోలింగ్ శాతాన్ని ప్రకటించలేకపోయారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. నిజంగా ఏదైనా ఒకట్రెండు నియోజకవర్గాల్లో సమస్యలు ఉంటే..వాటిని పెండింగ్ లో పెట్టి..వివరాలు వెల్లడించవచ్చు. గతంలో కూడా ఇలాగే చేసిన సందర్భాలు ఎన్నో. అలా కాకుండా రజత్ కుమార్ ఏకంగా తుది పోలింగ్ శాతం ప్రకటించటం జాప్యం చేయటం తీవ్ర చర్చకు దారితీసింది. టెక్నాలజీ ఎంతో పెరిగిన ఈ దశలో కూడా పోలింగ్ శాతానికి ఇంత సమయం తీసుకోవాల్సిన అవసరం ఏమీలేదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ అభ్యర్ధి రేవంత్ రెడ్డి విషయంలో కూడా రజత్ కుమార్ వ్యవహారశైలిపై సీఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి తర్వాత ఆయన్ను ఈ బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉందని కూడా అధికార వర్గాలు చెబుతున్నాయి.

Next Story
Share it