Telugu Gateway
Politics

ప్రజా ఫ్రంట్ దే ‘పవర్!’..లగడపాటి వెల్లడి

ప్రజా ఫ్రంట్ దే ‘పవర్!’..లగడపాటి వెల్లడి
X

హై ఓల్టేజ్ తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు కొత్త సంచలనం. ఎప్పుడూ సర్వేల విషయలో ఖచ్చితత్వం ఉండే లగడపాటి తెలంగాణ ఎన్నికలకు సంబంధించి తన అంచనాలను వెలువరించారు. ఇది ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. లగడపాటి అంచనాలు వెలువరించిన వెంటనే అధికార టీఆర్ఎస్ పార్టీ ఆయనపై ఎటాక్ ప్రారంభించింది. తమకు అనుకూలంగా వచ్చిన సర్వేలను శభాష్ శభాష్ అంటూ..ఎవరైనా వ్యతిరేకంగా ఇస్తే వారిపై ‘ఎటాక్’ చేయటం ప్రతి రాజకీయ పార్టీ చేసే పని. ఇప్పుడు టీఆర్ఎస్ అదే పనిచేస్తోంది. ఇక లగడపాటి సర్వే వివరాలను చూద్దాం. ఇప్పటికే ఇద్దరు స్వతంత్ర అభ్యర్ధుల పేర్లు ప్రకటించిన లగడపాటి మంగళవారం నాడు కొత్తగా మరో మూడు పేర్లు వెల్లడించారు. ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, మక్తల్ నుంచి జలంధర్ రెడ్డి, బెల్లంపల్లి నుంచి జి.వినోద్ గెలుస్తారని లగడపాటి తెలిపారు. మరో మూడు నియోజకవర్గాల్లో తన సన్నిహితులు పోటీ చేస్తున్నారని.. వారి అభ్యర్థన మేరకు ఆ మూడు స్థానాల గురించి చెప్పడం లేదన్నారు.

తన సర్వే ఎప్పుడూ నిష్పక్షపాతంగా సాగుతుందన్నారు. జిల్లాల వారీగా చూసినప్పుడు ఒక్కో జిల్లా ఒక్కోలా కనిపించిందని లగడపాటి చెప్పారు. గత ఎన్నికల్లోలా పోలింగ్ 68.5 శాతం మాత్రమే నమోదు అయితేనే తన సర్వే అంచనాలు నిజమయ్యే అవకాశం ఉందని, పోలింగ్ శాతం పెరిగితే అంచనాలన్నీ తారుమారు అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా.. వరంగల్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉందని, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో కూటమి-టీఆర్ఎస్ మధ్య పోటాపోటీ ఉందని వెల్లడించారు. ఉమ్మడి జిల్లాల ఆధారంగా సర్వే సాగినట్లు లగడపాటి తెలిపారు. హైదరాబాద్‌లో ఎంఐఎం ఆధిక్యంలో ఉందని, బీజేపీకి మునుపటి కంటే ఈ సారి సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు.

బుధవారం వరకు గడువు ఉండడంతో అవకాశం ఉంటే రేపు మరిన్ని విషయాలు చెబుతానని, 7వ తేదీ సాయంత్రం సర్వే పూర్తి వివరాలు వెల్లడిస్తానని లగడపాటి వెల్లడించారు. గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం తగ్గితే హంగ్ ఛాన్స్ ఉందని జోస్యం చెప్పారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు గాను వంద నియోజకవర్గాల్లో తమ టీమ్ లు వంద నియోజకవర్గాల్లో సర్వే చేశారన్నారు. గతం కంటే ఓటింగ్ పెరిగితే మాత్రం అంచనాలు తారుమారు అవుతాయన్నారు. తనపై ఎవరి ఒత్తిళ్లు లేవని..అయితే ఇతరుల సర్వేలపై తాను వ్యాఖ్యానించనని తెలిపారు.

Next Story
Share it