Telugu Gateway
Telangana

ఈ ఫిరాయింపులకు కెసీఆర్ ఏ పేరు పెడతారో?

ఈ ఫిరాయింపులకు కెసీఆర్ ఏ పేరు పెడతారో?
X

తొలిసారి బొటాబొటీ మెజారిటీతో గెలిచిన సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ తాను ప్రోత్సహించిన ఫిరాయింపులకు ‘రాజకీయ ఏకీకరణ’ అనే ముద్దు పేరు పెట్టుకున్నారు. 2014 లో కేవలం 63 సీట్లతోనే విజయం సాధించిన కెసీఆర్ అటు టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించి ఎమ్మెల్యేల సంఖ్యను 90కి పెంచుకున్నారు. దీనిపై విమర్శలు వస్తే...తన ప్రభుత్వాన్ని పడగొట్టాడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుట్ర చేశారని..అందుకు రాజకీయ ఏకీకరణ కోసం ఇదంతా చేశామని సమర్థించుకున్నారు. మరి ఈ సారి టీఆర్ఎస్ ఎన్నికల్లో ఏకంగా 119 సీట్లు ఉన్న అసెంబ్లీలో 88 సీట్లను దక్కించుకుంది. ఇప్పటికే చేరిన ఇండిపెండెంట్లతో కలుపుకుంటే ఆ సంఖ్య 90కి చేరింది. మరి ఇఫ్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవటాన్ని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ ఎలా సమర్ధించుకుంటారు?. ఏ కారణాలను చూపిస్తారు. అవసరం అయిన దానికంటే ఎంతో స్పష్టమైన ఆదిక్యతతో ఉన్నా..ఈ ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. ఇఫ్పటికే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ ను కలసిన విషయం తెలిసిందే.

తాము విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నామని..దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా నిలుపుతున్నామని చెప్పుకునే కెసీఆర్ ఈ ఫిరాయింపుల ద్వారా ప్రజలకు ఏమి సంకేతం ఇవ్వదలచుకున్నారు. గతంలో ఫిరాయింపులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన కెసీఆర్..ఇప్పుడు తాను కూడా అదే బాట పట్టడం వెనక కారణం ఏంటి?. రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే లేకుండా చేసి..పరిపాలన చేయాలనుకుంటున్నారా?. ఈ పరిణామాలపై టీఆర్ఎస్ నాయకులు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. గత ప్రభుత్వంలోనే తాము ఏమీ మాట్లాడలేకపోయామని..ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం కన్పిస్తుందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. మంత్రివర్గ విస్తరణ దగ్గర నుంచి ఏ విషయంలో పార్టీలోని ఎంత సీనియర్లకూ ఎలాంటి సమాచారం ఉండదని ఓ నేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it