Telugu Gateway
Politics

హరీష్ రావును ఎంపీగా పంపిస్తారా?!

హరీష్ రావును ఎంపీగా పంపిస్తారా?!
X

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావును ఎంపీగా పంపించే అవకాశం ఉందని పార్టీ నేతల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే రాష్ట్ర రాజకీయాలకు హరీష్ రావు పూర్తిగా దూరం అవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే హరీష్ శిబిరంలో ఓ రకమైన అలజడి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ తన తనయుడు కెటీఆర్ కు ఎక్కడా రాజకీయంగా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. తాజాగా కెటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి పార్టీపై పూర్తి పట్టు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నేతలు అందరూ కెటీఆర్ వెంటే పరుగులు పెడుతున్నారు. ఇటీవల వరకూ కెసీఆర్ తర్వాత అన్ని జిల్లాల్లో పార్టీ నేతలతో సబ్సంబంధాలు ఉన్న నేతగా హరీష్ రావుకు పేరుంది. అయితే తాజా ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినందున పార్టీలో..ప్రభుత్వంలో అనేక ‘అధికార కేంద్రాలు’ ఉంటే లేని పోని సమస్యలు వస్తాయనే ఉద్దేశంతోనే హరీష్ రావును కెసీఆర్ పార్లమెంట్ కు పంపే యోచనలో ఉన్నారని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అందేలో భాగంగానే ప్రస్తుతం పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని విస్తరించకుండా ఎంపిక చేసిన కొంత మందితో కేబినెట్ కూర్పు పూర్తి చేసి..పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారని చెబుతున్నారు. అయితే ఈ పాక్షిక మంత్రివర్గ విస్తరణలో హరీష్ రావుకు చోటు దక్కుతుందా? లేదా అన్న టెన్షన్ పార్టీ వర్గాల్లో ఉంది. ఈ నెలాఖరులో జరుగుతుందని చెబుతున్న పాక్షిక విస్తరణలో హరీష్ రావుకు చోటు దక్కకపోతే ఆయన లోక్ సభకు పంపేందుకు మార్గం సిద్ధమైనట్లే అని ఓ సీనియర్ నాయకుడు తెలిపారు. తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలను హరీష్ రావు కూడా మౌనంగా వీక్షిస్తున్నారే తప్ప..ఎక్కడా ఎలాంటి ప్రకటనలు చేయటం లేదు. పైగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన కెటీఆర్ కు తన పూర్తి సహకారం ఉంటుందని ప్రకటించారు. ఈ మధ్యనే టీఆర్ఎస్ లో చేరిన వారు..కొత్తతరం నేతలు అందరూ హంగామా చేస్తుంటే..హరీష్ రావు మాత్రం లో ఫ్రొఫైల్ మెయింటెన్ చేస్తున్నారు.

Next Story
Share it