Telugu Gateway
Telangana

ప్రధానిని నిర్ణయించే శక్తిగా తెలంగాణ

ప్రధానిని నిర్ణయించే శక్తిగా తెలంగాణ
X

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని..అప్పుడు ప్రధానిని నిర్ణయించే శక్తి తెలంగాణకు వస్తుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ వ్యాఖ్యానించారు. అప్పుడే తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ కార్యక్రమాలను దేశమంతటా అమలు చేయవచ్చని అన్నారు. రాష్ట్రానికి సేవ చేస్తున్న తరహాలోనే దేశానికి సేవ చేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. వందేళ్ళ పాటు ఉండేలా టీఆర్ఎస్ ను తీర్చిదిద్దటమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఓ వైపు ఈ ఎన్నికల్లో ఇఛ్చిన హామీలను అమలు చేస్తూ..వచ్చే లోక్ సభ, పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా గెలిచేందుకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కెసీఆర్ ఒక్కరు ఒక వైపు...మిగిలిన పార్టీలు అన్నీ ఒక వైపు ఉన్నా తామే విజయం సాధించామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 2 కోట్ల ఓట్లు పోలయితే..అందులో 98 లక్షల ఓట్లు టీఆర్ఎస్ కు వచ్చాయన్నారు. తాను చెప్పినట్లే బిజెపి ఈ ఎన్నికల్లో వంద సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా వచ్చినా పెద్దగా ఏమీ సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు. కెటీఆర్ శనివారం నాడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో పాల్గొన్నారు.

కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచే జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించనున్నారని ఆయన తనయుడు కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ సీఎంగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తారని వెల్లడించారు. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్న నేపథ్యంలో మే లేదా జూన్‌లో మీట్‌ ది ప్రెస్‌కు ముఖ్యమంత్రిగా ఏమైనా వస్తారా అని ఓ పాత్రికేయుడు ప్రశ్నించగా.. అలాంటిదేమి లేదని కొట్టిపారేశారు. ‘జాతీయ రాజకీయాలంటే ఢిల్లీలోనే కూర్చుని చేయాలని లేదు. అలా అని రూల్‌ ఎక్కడా లేదు, రాజ్యాంగంలో ఎక్కడా రాసిలేదు. జాతీయ రాజకీయాలను హైదరాబాద్‌ నుంచి శాసించొచ్చు.

తెలంగాణ సీఎంగా ఉంటూ కూడా జాతీయ రాజకీయాల్లో మన ముద్ర వేయొచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్‌ ఆనాడు దేశ రాజకీయాలను కూడా శాసించారు. తెలంగాణ రాష్ట్రానికి మరో పది, పదిహేనేళ్లు కచ్చితంగా కేసీఆర్‌ నాయకత్వం అవసరముంది. నాతోపాటు, లక్షలాది మంది కార్యకర్తలు బలంగా ఇదే కోరుకుంటున్నారు. పార్టీ కార్యనిర్వహక అధ్యక్ష పదవి నాకు ఇచ్చారని, మరేదో పెద్ద పదవి నాకు ఇస్తారని ఊహించి రాసి ఇలాంటి ప్రశ్నలు అడగొద్దు. హైదరాబాద్‌లో సీఎంగానే ఉంటూనే మన పాత్ర పోషించవచ్చు. సీఎం పోస్టు మరో పది, పదిహేనేళ్లు ఖాళీగా లేదన్నారు.

Next Story
Share it