Telugu Gateway
Telangana

కెసీఆర్ కు రెండు ఓట్లు ఎలా?

కెసీఆర్ కు రెండు ఓట్లు ఎలా?
X

అర్హులైన లక్షలాది మంది ఓట్లను అక్రమంగా తొలగించిన అధికారులు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ కు రెండు చోట్ల ఓటు హక్కు ఎలా కల్పిస్తారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ఆదివారం నాడు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఇంటి పేరును ముందు వెనుకాల మార్చి రెండు చోట్ల ఓట్లు పొందారని ఆరోపించారు. సిద్దిపేట నియోజకవర్గం చింతమడకలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సన్ ఆఫ్‌ రాఘవరావు అనే పేరు మీద ఒక ఓటు హక్కును నమోదు చేసుకొన్నారని, గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలో చంద్రశేఖర రావు సన్ ఆఫ్ రాఘవ రావు అనే పేరు మీద మరో ఓటు హక్కును నమోదు చేసుకున్నారని పేర్కొ‍న్నారు. ఇలా ఒకే వ్యక్తి రెండు పేర్ల మీద ఓటు హక్కును నమోదు చేసుకోవడం చట్టరీత్యా నేరమని, దీనిపై ఎన్నికల సంఘం ఏమి చేస్తోందని ప్రశ్నించారు.

కేసీఆర్‌ రెండు ఓట్లపై రాష్ట్ర ఎన్నికల అధికారి స్పందించకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో లక్షల ఓట్లు గల్లంతయ్యాయని అన్నారు. అర్హులకు ఓటు హక్కు కల్పించకపోవడం వలన తీరని అన్యాయం జరిగిందని మండిపడ్డారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగించారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది అర్హుల ఓట్లను తొలిగించారన్నారు. కొడంగల్‌లో తాను ఓడిపోతానని కేసీఆర్‌, కేటీఆర్‌లు ప్రచారం చేస్తున్నారని, ఓడకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కేటీఆర్‌ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. కొడంగల్ నుంచి తాను గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మహాకూటమిలో కాంగ్రెస్ తొలి స్థానంలో, టీడీపీ రెండవ స్థానంలో, టీజేఎస్, సీపీఐలు తర్వాతి స్థానంలో ఉంటాయని తెలిపారు.

Next Story
Share it