Telugu Gateway
Telangana

ఉమ్మడి హైకోర్టు విభజన పూర్తి

ఉమ్మడి హైకోర్టు విభజన పూర్తి
X

రాష్ట్ర విభజనలో అత్యంత కీలకమైన ఘట్టం కూడా పూర్తయింది. నాలుగున్నర సంవత్సరాలుగా నానుతూ వచ్చిన హైకోర్టు విభజన ఎట్టకేలకు పూర్తయింది. ఈ పరిణామంపై తెలంగాణ సర్కారు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది. ఇక ఎవరి కోర్టులు వారివే. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయింది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పాటును నోటిఫై చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఆ వెంటనే కేంద్ర న్యాయశాఖ దానిని గెజిట్‌లో ప్రచురించింది. జనవరి 1, 2019 నుంచి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పాటవుతుందని రాష్ట్రపతి ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని అధికరణ 214, సుప్రీంకోర్టు ఆదేశాలు, ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని సెక్షన్లు 30 (1)(ఏ), 31(1), 31(2) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఆప్షన్‌ ఇచ్చిన 16 మంది న్యాయమూర్తులు 2019 జనవరి 1 నుంచి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా వ్యవహరి స్తారు. అలాగే తెలంగాణకు ఆప్షన్‌ ఇచ్చిన 10 మంది న్యాయమూర్తులు కూడా జనవరి 1, 2019 నుంచి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా చెలామణి అవుతారు. దీంతో ఉమ్మడి హైకోర్టు అంతర్థానమై రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పడినట్లైంది.

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులుగా వ్యవహరించేది వీరే.

  1. జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ (ప్రస్తుతం ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.)

    2. జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌

    3. జస్టిస్‌ సరస వెంకట నారాయణ బట్టి

    4. జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి

    5.జస్టిస్‌ దామా శేషాద్రి నాయుడు (బదిలీపై ప్రస్తుతం కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు)

    5. జస్టిస్‌ మంథాట సీతారామమూర్తి

    6.జస్టిస్‌ ఉప్మాక దుర్గా ప్రసాద్‌ రావు

    7.జస్టిస్‌ తాళ్లూరి సునీల్‌ చౌదరి

    8.జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి

    9.జస్టిస్‌ గుడిసేవ శ్యాంప్రసాద్‌

    10.జస్టిస్‌ జవలాకర్‌ ఉమాదేవి

    11.జస్టిస్‌ నక్కా బాలయోగి

    12.జస్టిస్‌ తేలప్రోలు రజని

    13.జస్టిస్‌ దూర్వాసుల వెంకట సుబ్రహ్మణ్య సూర్యనారాయణ సోమయాజులు

    14.జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి

    15.జస్టిస్‌ మంతోజు గంగారావు.

ఈ 16 మందిలో జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, జస్టిస్‌ శేషాద్రి నాయుడు వేరే హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా కొనసాగుతున్నందున మిగిలిన 14 మందే జనవరి 1 నుంచి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా విధులు నిర్వర్తిస్తారు.

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల విషయానికొస్తే..

  1. జస్టిస్‌ పులిగోరు వెంకట సంజయ్‌ కుమార్‌

    2. జస్టిస్‌ మామిడన్న సత్యరత్న శ్రీరామచంద్రరావు

    3. జస్టిస్‌ అడవల్లి రాజశేఖర్‌ రెడ్డి

    4. జస్టిస్‌ పొనుగోటి నవీన్‌ రావు

    5. జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ చౌదరి

    6. జస్టిస్‌ బులుసు శివశంకర్‌ రావు

    7. జస్టిస్‌ డాక్టర్‌ షమీమ్‌ అక్తర్‌

    8. జస్టిస్‌ పోట్లపల్లి కేశవరావు

    9. జస్టిస్‌ అభినందన్‌ కుమార్‌ షావిలి

    10. జస్టిస్‌ తొండుపునూరి అమర్‌నాథ్‌ గౌడ్‌ వ్యవహరిస్తారు.

ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి తెలంగాణకు ఆప్షన్‌ ఇచ్చారు.

Next Story
Share it