Telugu Gateway
Politics

బిజెపి అభ్యర్ధి ఇంట్లో ఈవీఎం

బిజెపి అభ్యర్ధి ఇంట్లో ఈవీఎం
X

ఒక చోట బిజెపి అభ్యర్ధి ఇంట్లో ఈవీఎం. మరో చోట రోడ్డు మీద ఈవీఎం. ఎన్నికల విధుల్లో ఉన్న వారు సాగించిన నిర్వాకాలు ఇవీ. ఇక శుక్రవారం నాడు ముగిసిన తెలంగాణ ఎన్నికల్లో అయితే ఎన్నికల సంఘం వైఫల్యాలు లెక్కలేనన్ని. రాజస్ధాన్ శాసనసభ ఎన్నికల సందర్భంగా పాలి నియోజకవర్గ బిజెపి అభ్యర్ధి ఇంట్లో ఈవీఎం ఉండటం కలకలం రేపింది. రాజస్థాన్ లోనూ తెలంగాణతో పాటే శుక్రవారం నాడే ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. పోలింగ్ కేంద్రంలో ఉండాల్సిన అదనపు ఈవీఎంను సంబంధిత ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న అధికారి బిజెపి అభ్యర్ధి ఇంట్లో పెట్టారు. ఈ విషయాన్ని కొంత మంది వ్యక్తులు వీడియో తీసి నెట్ లో పెట్టేశారు. అంతే ఒక్కసారిగా కలకలం రేగింది. దీనికి కారణమైన అధికారిని విధుల బాధ్యతల నుంచి తప్పించారు. ఇదిలా ఉంటే రాజస్థాన్‌లోనే ఎన్నికల అధికారులు బ్యాలెట్‌ యూనిట్‌లను తరలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

బరాన్‌ జిల్లాలో కిషన్‌ గంజ్‌ అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోని షహాబాద్‌లో రోడ్డుపైనే బ్యాలెట్‌ యూనిట్‌ లభించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈవీఎం మిషిన్లను స్ట్రాంగ్‌ రూంలకు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేశారు. రోడ్డుపై లభించిన బ్యాలెట్‌ యూనిట్‌ను కిషన్‌గంజ్‌లోని స్ట్రాంగ్‌ రూంకు తరలించారు. రాజస్థాన్‌ అసెంబ్లీలోని 200 స్థానాలకు గాను ఒక్కటి మినహా 199 సీట్లకు శుక్రవారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

Next Story
Share it