Telugu Gateway
Telangana

ప్రధాన పత్రికకు ఎన్నికల అధికారి బెదిరింపు!

ప్రధాన పత్రికకు ఎన్నికల అధికారి బెదిరింపు!
X

‘రాజ్యాంగబద్ద సంస్థపై ఇష్టం వచ్చినట్లు వార్తలా?. ఎన్నికల నిర్వహణలో ఈసీ ఫెయిల్ అంటూ వార్తలు రాస్తారా?. లీగల్ నోటీసులు ఇస్తాం.’ అంటూ హుంకరించారు తెలంగాణ ఎన్నికల సంఘానికి చెందిన ఓ ఎన్నికల అధికారి. ఇప్పుడు ఈ వ్యవహారం మీడియా సర్కిల్స్ హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల నిర్వహణలో ఘోరంగా విఫలమవటమే కాకుండా..వార్తలు రాసిన మీడియాను బెదిరించటం ఏమిటన్న చర్చ మొదలైంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఓటింగ్ ముగిసిన 29గంటల తర్వాత కానీ తుది పోలింగ్ శాతం ఇచ్చిన ఘనత కూడా వీళ్ళదే. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. సాంకేతిక అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో కూడా ఓటింగ్ పూర్తయిన రోజు అర్థరాత్రి చాలా వరకూ తుది ఓటింగ్ శాతాలు అందేవి. కానీ టెక్నాలజీ ఎంతో అప్ గ్రేడ్ అయినా కూడా తెలంగాణ ఎన్నికల సంఘం మాత్రం ఎన్నికల నిర్వహణ విషయంలో పలు విమర్శలు ఎదుర్కొంది. ముందస్తు ఎన్నికలకు ముహుర్తం ఖరారు అయినప్పటి నుంచి అర్హులైన వారి ఓట్లు తొలగింపు..జాబితాల నిండా బోగస్ ఓట్లు నిండి ఉన్న అంశాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వచ్చాయి.

అయినా సరే...ఏవో కొన్ని మార్పులు చేసి ముందుకు సాగారు. సాక్ష్యాత్తూ తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఏకంగా మీడియా సాక్షిగా పొరపాటు జరిగిందని అంగీకరించారు కూడా. ఇవన్నీ వదిలేసి రాజ్యాంగ బద్ద సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా వార్తలు రాశారని తిరిగి పత్రికలను బెదిరించటం ఏమిటని అధికారవర్గాల్లోనూ చర్చ జరగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కూడా ఈ వ్యవహారంపై అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.

Next Story
Share it