Telugu Gateway
Politics

ఎవరి ‘లెక్కలు’ వారివే..అసలు లెక్కతేల్చనున్న ఓటర్

ఎవరి ‘లెక్కలు’ వారివే..అసలు లెక్కతేల్చనున్న ఓటర్
X

అసలు లెక్క తేలటానికి రంగం సిద్ధం అయింది. ప్రధాన పార్టీలు అన్నీ ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ గెలుపుపై ధీమాతో ఉన్నారు. అయినా గెలిచేది ఒక్కరే కదా?. అది ఎవరో డిసెంబర్ 11న తేలనుంది. కాకపోతే శుక్రవారం నాడు పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడే ‘ఎగ్జిట్ పోల్స్’తోనూ కొంత మేర సంకేతాలు వెలువడే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీని ముందస్తుగా రద్దు చేసిన తర్వాత..ఏకంగా మూడు నెలల పాటు పార్టీలు కసరత్తులతోపాటు..ఎత్తులకు పైఎత్తులు వేసి ప్రచారాన్ని ముగించాయి. ప్రచారం ముగిసిన నాటి నుంచి ఛాన్స్ ఉన్న చివరి నిమిషం వరకూ తెలంగాణ రాష్ట్రమంతటా ప్రలోభాల పర్వం జోరుగా సాగుతోంది. మరి ప్రలోభాలు ఫలితాలపై ప్రభావం చూపిస్తాయా?. లేదా దేని కథ దానిదేనా? అన్న సంగతి తేలాలంటే డిసెంబర్ 11 వరకూ ఆగాల్సిందే. గత ఎన్నికల తరహాలోనే టీఆర్ఎస్ ఒంటరిగా బరిలోకి దిగి సవాల్ విసరగా..కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితి (టీజెఎస్) కూటమిగా ఏర్పడి అధికార పార్టీకి సవాల్ విసిరాయి.

దీంతో ఫలితాలపై అత్యంత ఉత్కంఠ నెలకొంది. ఇక బెట్టింగ్ రాయుళ్లు అయితే ఎవరి పనిలో వారు ఉన్నారు. తెలంగాణ పూర్తి ఎన్నికల ఫలితాలపైనే కాకుండా...కీలక స్థానాలపై కూడా ప్రత్యేకంగా బెట్టింగ్ రాయుళ్లు బెట్టింగ్ లు కాస్తున్నారు. వీటిలో ఎక్కువ శాతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, మంత్రి కెటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లతోపాటు నందమూరి సుహాసిని పోటీ చేస్తున్న కూకట్ పల్లి, శేరిలింగంపల్లి వంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల గెలుపుతోపాటు..మెజారిటీ తదితర అంశాలపై కూడా బెట్టింగ్ లు సాగుతున్నట్లు సమాచారం. మరి ఓటర్ ఎవరి తరపున మొగ్గుచూపుతారో తెలియాలంటే డిసెంబర్ 11 వరకూ ఎదురుచూడాల్సిందే.

Next Story
Share it