Telugu Gateway
Telangana

ఆ సర్వే ప్రకారం టీఆర్ఎస్ కు గడ్డుకాలమే!

ఆ సర్వే ప్రకారం టీఆర్ఎస్ కు గడ్డుకాలమే!
X

గెలుపు ఏకపక్షం. ఒంటి చేత్తో వంద సీట్లు కొట్టేస్తామంటూ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేతలు ఇంత కాలం చెబుతూ వచ్చారు. కానీ రిపబ్లిక్ టీవీ, సీ ఓటర్ నిర్వహించిన సర్వే ప్రకారం తెలంగాణలో టీఆర్ఎస్ గెలుపు అంత సులభం కాదని సంకేతాలు ఇఛ్చింది. ఢీ అంటే ఢీ అనే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైతే మహాకూటమే ఎడ్జ్ లో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. కేవలం పార్లమెంట్ స్థానాల్లోనే ఈ రెండు సంస్థలు ఈ సర్వే నిర్వహించాయి. అయితే అసెంబ్లీ సీట్లలోనూ ఇదే పరిస్థితి ఉంటుందా? లేదా అన్నది వేచిచూడాల్సిందే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో కూటమికి 8 లోక్ సభ సీట్లు వస్తాయని సర్వే తేల్చింది. అదే టీఆర్ఎస్ కు 7 సీట్లు వస్తాయని పేర్కొంది. ఎంఐఎంకు ఒకటి..బిజెపికి ఒక సీటు దక్కే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. సహేతుకమైన కారణం లేకుండా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లటం, ఇంటింటికి నీళ్లు ఇస్తే తప్ప ఓట్లు అడగను అని చెప్పిన కెసీఆర్ హామీని నిలబెట్టుకోకుండానే ఎన్నికలకు వెళ్లటం వంటి అంశాలు క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ కు ప్రతికూలంగా మారాయి.

ఇవే కాదు..ఉద్యోగులు, నిరుద్యోగులు, కౌలురైతులు, ఆర్టీసీ ఉద్యోగులేంటి పలు వర్గాల్లో సర్కారుపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీనికి తోడు స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకత..అంతర్గత కుమ్ములాటలు టీఆర్ఎస్ కు పెద్ద సమస్యగా పరిణమించాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ టీడీపీతోపాటు..టీజెఎస్, సీపీఐలను కలుపుకుని ముందుకు సాగాలని నిర్ణయించటం టీఆర్ఎఎస్ కు పెద్ద షాక్ గా మారింది. తెలంగాణ టీడీపీకి చెందిన సీనియర్లు అనేక మంది పార్టీని వీడినా..ఆ పార్టీ ప్రభావితం చేసే నియోజకవర్గాల సంఖ్య తేలిగ్గా 30 నుంచి 35 వరకూ ఉంటుందని పలు సర్వేల్లో తేలింది. అన్నీ కలిపి టీఆర్ఎస్ కు ఎదురుగాలి వీచేలా చేస్తున్నాయి. మరి ముందస్తు కెసీఆర్ కు ఎలాంటి ఫలితాన్ని మిగులుస్తుందో వేచిచూడాల్సిందే. ఏపీలో మాత్రం ప్రతిపక్ష వైసీపీకి 20 లోక్ సభ సీట్లు, అధికార టీడీపీకి కేవలం ఐదు సీట్లు మాత్రమే వస్తాయని రిపబ్లిక్-సీ ఓటర్ సర్వే తేల్చింది.

Next Story
Share it