Telugu Gateway
Politics

డిసైడింగ్ ఫ్యాక్టర్ అయినా డోంట్ కేర్ అంటున్న కెసీఆర్!

డిసైడింగ్ ఫ్యాక్టర్ అయినా డోంట్ కేర్ అంటున్న కెసీఆర్!
X

తెలంగాణలోని 50 నియోజకవర్గాల్లో గెలుపును నిర్ణయించేది మహిళలే. అయినా సరే అధికార టీఆర్ఎస్ మాత్రం మహిళలు అంటే డోంట్ కేర్ అంటోంది. ప్రతి పార్టీ మహిళా సాధికారికత, రాజకీయ రిజర్వేషన్ల గురించి ఛాన్స్ దొరికిన ప్రతిసారీ స్పీచ్ లు దంచేస్తారు. కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఆ విషయాలన్నీ మర్చిపోతారు. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ మాత్రం ఈ విషయంలో మహిళలను మరీ చిన్నచూపు చూస్తున్నట్లు కన్పిస్తోంది. తెలంగాణలోని మొత్తం 119 సీట్లకు గాను ఆ పార్టీ కేవలం నాలుగంటే నాలుగు సీట్లను మాత్రమే మహిళలకు కేటాయించింది. ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ అయితే తాను పోటీ చేసే 94 సీట్లలో 11 సీట్లను మహిళలకు కేటాయించింది. కూటమి పరంగా చూస్తే 119 సీట్లకు గాను మహిళలకు కేటాయించిన సీట్ల సంఖ్య 14కు పెరుగుతుంది. టీఆర్ఎస్ తో పోలిస్తే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజెఎస్ లతో కూడిన కూటమి మహిళలకు ఒకింత మెరుగైన విధంగా సీట్లు కేటాయించిందనే చెప్పొచ్చు.

జాతీయ పార్టీ అయిన బిజెపి కూడా 118 సీట్లకు గాను 11 సీట్లు మహిళలకు కేటాయించింది. దీంతో అందరి చూపు టీఆర్ఎస్ వైపే పడింది. గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో కెసీఆర్ తన కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా చోటు కల్పించకుండా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ అంశంపై ఎవరైనా ప్రశ్నించినా కూడా అధికార పార్టీ నేతల స్పందన కూడా అంతే లైట్ గా ఉండేది. తాజా గా మీట్ ది ప్రెస్ లో మాట్లాడిన మంత్రి కెటీఆర్ మహిళలకు కేబినెట్ లో చోటు లేకపోవటంపై స్పందిస్తూ రకరకాల ఈక్వేషన్స్ లో వారికి చోటు దక్కలేదని..వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే అప్పుడు రావొచ్చేమో అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీని వీడిన మహిళా నేతలు కూడా ఈ విషయంలో కెసీఆర్ ను తప్పుపట్టారు. సహజంగా ప్రతి రాజకీయ పార్టీ ప్రత్యర్ధి పార్టీలకు సంబంధించిన బలహీనతలను ప్రచారం చేయటానికి పెద్ద పీట వేస్తాయి. మహిళలకు టీఆర్ఎస్ కేవలం నాలుగు సీట్లు మాత్రమే ఇచ్చిన అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలనే ప్రణాళికలో ప్రతిపక్షాలు ఉన్నాయి. మరి వీరి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it