Telugu Gateway
Telangana

ఎక్కడైనా సరే ‘లక్ష’ అడుగుతున్న కెసీఆర్!

ఎక్కడైనా సరే  ‘లక్ష’ అడుగుతున్న కెసీఆర్!
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. రోజూ నాలుగైదు సభల్లో ప్రసంగిస్తూ ప్రచార సభల ‘టార్గెట్’ చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల నాటికి మెజారిటీ నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తి చేయాలనేది ఆయన ప్లాన్. సర్వేలు అన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్న కెసీఆర్ ప్రతి నియోజకవర్గంలోనూ ఆ పదం మాత్రం వదలటం లేదు. ఆయన ప్రచారం చేసిన ప్రతి చోటా టీఆర్ఎస్ అభ్యర్ధులకు ‘లక్ష’ ఓట్ల మెజారిటీతో గెలిపించాలని పదే పదే కోరుతున్నారు. సిద్ధిపేట, దుబ్బాక నియోజకవర్గాలతోపాటు...మెదక్, నకిరేకల్, భువనగిరితో సహా కెసీఆర్ ప్రచారం చేసిన ప్రతి చోటా ఆయన అడిగేది ‘లక్ష’ ఓట్ల మెజారిటీనే. ఎన్నికల ముందు నుంచి వంద సీట్లు.వంద సీట్లు అంటూ ఎలా ప్రచారంలో పెట్టారో...ఇప్పుడు లక్ష ఓట్ల మెజారిటీ..లక్ష మెజారిటీ పదాన్ని కూడా పాపులర్ చేసే పనిలో పడ్డారు కెసీఆర్.

మహాకూటమి కారణంగా టీఆర్ఎస్ విజయావకాశాలు సన్నగిల్లుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే ఆయన ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ కంటే తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. దొడ్డిదారిలో చంద్రబాబు మళ్లీ తెలంగాణలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని...ఆయన్ను ప్రజలే ఓటుతో అడ్డుకోవాలని సెంటిమెంట్ ను రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి కెసీఆర్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో తెలియాలంటే డిసెంబర్ 11 వరకూ ఆగాల్సిందే.

Next Story
Share it