Telugu Gateway
Andhra Pradesh

తెలుగు కాంగ్రెస్..కాంగ్రెస్ తెలుగు!

తెలుగు కాంగ్రెస్..కాంగ్రెస్ తెలుగు!
X

‘అవకాశవాదానికి అడ్రస్ కావాలని అడిగితే దానికి సరైన చిరునామా మా చంద్రబాబే. అడ్రసే కాదు..అవకాశవాద రాజకీయాలకు సంబంధించి ఆయన ఓ పుస్తకం కూడా. ఎందుకంటే ఆయన ఆ పుస్తకంలోని పేజీలను చదవటాని కంటే అవసరానికి అనుగుణంగా వాటిని చింపేసుకుంటూ పోతారు. మళ్ళీ అతికించుకుంటూ పోతారు. అంత నైపుణ్యం బహుశా దేశ రాజకీయాల్లో మరో నేత ఎవరికీ లేదేమో.’ ఇవీ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు గురించి ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు. ఏపీని విభజించిన కాంగ్రెస్ పార్టీపై బహుశా ప్రత్యర్ధి పార్టీ అయిన బిజెపి నేతలైన ప్రధాని మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాలు కూడా అలా తిట్టి ఉండరు. కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నేతలైన సోనియా, రాహుల్ పై చంద్రబాబు అండ్ టీమ్ చేసినన్ని విమర్శలు బహుశా దేశంలో ఎవరూ చేసి ఉండకపోవచ్చు. ఢిల్లీలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయిన తర్వాత టీడీపీ నేతల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

ఏపీలో అయితే తమ పార్టీ పేరును తెలుగు కాంగ్రెస్ అని మార్చుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే ఏపీలో ప్రస్తుతం బలంగా ఉన్నది టీడీపీ..అంతంత మాత్రంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అదే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్ తెలుగు అని పిలుచుకోవాలట. దీనికీ ఓ రీజన్ ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉండే..టీడీపీ ఇప్పుడు తోక పార్టీగా మారింది. అందుకే రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు తమ పార్టీ పేర్లు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుగుదేశం సీనియర్లు అంతర్గత చర్చల్లో వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ అనూహ్యమైన కలయిక ఎక్కడ తమ పుట్టి ముంచుతుందో అన్న టెన్షన్ టీడీపీ నేతల్లో ఉంది. విభజన చేసిన కాంగ్రెస్ కు ఎలాంటి షాక్ ఇచ్చారో టీడీపీ నేతలు గత ఎన్నికల సమయంలోనే చూశారు. అలాంటి పార్టీతో అంటకాగితే ప్రజలు హర్షిస్తారా?. పొత్తును ఆమోదిస్తారా? అన్న భయం సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో నెలకొంది. ఓ వైపు తెలంగాణలో పొత్తు పెట్టుకుని..మరో వైపు ఢిల్లీలో రాహుల్ గాంధీతో కలసి వీణను మీటిన చంద్రబాబు తమను మంచుతారో..తేల్చుతారో ఎన్నికల తర్వాత కానీ తేలదని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఈ అసాధారణ కలయిక ఫలితం ఎలా ఉంటుందో అన్న టెన్షన్ టీడీపీ నేతల్లో నెలకొంది.

Next Story
Share it