Telugu Gateway
Telangana

కూటమి సీట్లలో రెబెల్స్ కు ఇం‘ధన’ కాంట్రాక్ట్ ఎవరిది?

కూటమి సీట్లలో రెబెల్స్ కు  ఇం‘ధన’ కాంట్రాక్ట్ ఎవరిది?
X

ఎన్నికలు అంటే రెబెల్స్ సహజం. ఈ పరిణామం అన్ని పార్టీల్లోనూ ఉంటుంది. అయితే ప్రత్యర్ధి పార్టీలకు చెందిన రెబెల్స్ కు ‘ఆర్థిక’ సాయం అందించి..ఓట్లు చీలిస్తే తాము బయటపడొచ్చు. ఇదీ కొంత మంది నేతల ప్లాన్. తమ గెలుపు కోసం రెబెల్స్ ను రంగంలోకి దింపుతున్న ప్రత్యేక ఆపరేషన్ ఇది. ఎన్నికల్లో గెలవాలంటే రకరకాల ప్రణాళికలు అమలు చేస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు కూటమికి చెందిన రెబెల్స్ తో చర్చలు జరిపి..వాళ్లందరిని బరిలో నిలపటమే కాకుండా..భారీ ఎత్తున ఆర్థిక సాయం అందించేందుకు అవసరమైన ప్రణాళికలు కూడా రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తీవ్ర పోటీ ఉన్న స్థానంలో టిక్కెట్ దక్కించుకున్న వ్యక్తి..తనకు రెబెల్స్ లేకుండా ఉండేందుకు టిక్కెట్ ఆశించిన వ్యక్తిని నయానో..భయానో దారిలోకి తెచ్చుకోవటం ఒకెత్తు లేదా ‘ప్యాకేజీ’ ఇచ్చి పోటీ నుంచి తప్పుకునేలా ఏర్పాట్లు చేసుకుంటారు. ఇది కొన్ని చోట్ల వర్కవుట్ అవుతుంది. మరికొన్ని చోట్ల ఫెయిల్ అవుతుంది.

అయితే ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలనుకునే వారు ఎంపిక చేసిన స్థానాల్లో రెబెల్స్ కు తామే అన్ని రకాలు అండదండలు అందించటంతోపాటు..భారీ ఎత్తున ఆర్థిక సాయం చేయనున్నారు. ఇలాంటి ప్లాన్స్ ఈ ఎన్నికల్లో భారీ ఎత్తున సాగనున్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ అభ్యర్ధులకు నిధుల విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది. కానీ అదే ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఈ వ్యవహారాన్ని నడపాలంటే ఆర్థికంగా మరీ శక్తివంతుడై ఉండాలి. మరి ఈ ‘రెబెల్స్ రాజకీయం’ ఎవరిని ముంచుతుందో..ఎవరిని తేలుస్తుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it