Telugu Gateway
Top Stories

సీబీఐపై విచారణ..లీకువీరులపై సుప్రీం సీరియస్

సీబీఐపై విచారణ..లీకువీరులపై సుప్రీం సీరియస్
X

దేశంలోని అత్యున్నత విచారణ సంస్థ అయిన సీబీఐ ప్రతిష్ట రోజురోజుకూ మసకబారుతోంది. సీబీఐలోని ఉన్నతాధికారులు చేసుకున్న పరస్పర అవినీతి ఆరోపణలు..స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలో ప్రభుత్వ జోక్యం ఏ స్థాయిలో ఉన్నదనే అంశం ఇప్పుడు దేశంలో పెద్ద దుమారమే రేపుతోంది. అలోక్ వర్మ సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికతో పాటు సీబీఐ ఉన్నతాధికారులు సమర్పించిన అఫిడవిట్స్ లోని వివరాలు అన్నీ మీడియాలో బహిర్గతం అవటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆక్షేపణ తెలిపింది. లీకు వీరులపై మండిపడింది. మీకు లీకులు ఇచ్చే అంశంపై ఉన్న శ్రద్ధ..సంస్థ ప్రతిష్టపై ఉన్నట్లు కన్పించటం లేదని మండిపడింది. అదే సమయంలో ఈ కేసుకు సంబంధించిన అంశాలపై విచారణను నవంబర్ 29కి వాయిదా వేసింది. మోదీ సర్కార్‌లోని ఓ మంత్రికి ముడుపులు ముట్టాయని, మరో సీబీఐ అధికారిపై దర్యాప్తులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ జోక్యం చేసుకుంటున్నారని దర్యాప్తు సంస్థకు చెందిన సీనియర్‌ అధికారి మనోజ్‌ కుమార్‌ సిన్హా చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి.

సీబీఐ కేసు దర్యాప్తులో భాగంగా అలోక్‌ వర్మ ఇచ్చిన సమాధానాలు లీక్‌ కావడం పట్ల కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఓ దశలో సీబీఐ వివాదంపై విచారణ తమకు సమ్మతం కాదని పేర్కొంది. దర్యాప్తులో భాగంగా అలోక్‌ వర్మ చెప్పిన అంశాలను మీడియాకు లీక్‌ చేయడం పట్ల సీబీఐ డైరెక్టర్‌ వర్మ తరపు న్యాయవాది ఫాలి నారిమన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలోక్‌ వర్మ కేసుకు సంబంధించిన అంశాలు మీడియాకు లీక్‌ కావడంపై జస్టిస్‌ గగోయ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మీ పిటిషన్లు ఏవీ విచారణార్హమైనవని తాము భావించడం లేదని ఓ దశలో అసహనానికి లోనైన జస్టిస్‌ గగోయ్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తనను అకారణంగా సెలవుపై పంపడాన్ని సవాల్‌ చేస్తూ సీబీఐ చీఫ్‌ అలోక్‌ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Next Story
Share it