Telugu Gateway
Telangana

సోనియా ‘‘సెంటిమెంట్’ అస్త్రం!

సోనియా ‘‘సెంటిమెంట్’ అస్త్రం!
X

ఒక్క మాట. సోనియాగాంధీ నోటి నుంచి వచ్చిన ఒక్క మాట తెలంగాణ ప్రజల గుండెలను తడిమింది. ‘సొంత బిడ్డ దగ్గరకు తల్లి వచ్చినంత సంతోషంగా ఉంది.’ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆమె తొలిసారి ఈ గడ్డపై అడుగుపెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తెలంగాణ ప్రజలను కోరారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్ బహిరంగ సభలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లు మాట్లాడుతూ పీపుల్స్ ఫ్రంట్ ను గెలిపించాలని కోరారు. మేడ్చల్ సభలో సోనియాగాంధీ స్పీచ్ ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే...‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎలా అయితే కొట్లాడారో. అలాగే ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడాలి. మాట మీద నిలబడని వారిని నమ్మోద్దు. తెలంగాణలో పరిస్థితులు నన్ను బాధిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు వల్ల మీ కలలు నెరవేరాయా?. దళితులు..ఆదివాసీల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏమైనా చేసిందా?. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు బాధిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంత తేలికైన అంశం కాదని మాకు తెలుసు. అయినా ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ అందరం కలసి నిర్ణయం తీసుకున్నాం. ఇది నిర్ణయాత్మక..ఎన్నికల సమయం. ఈ ఎన్నికలతో తెలంగాణ ప్రజల భవిష్యత్ ముడిపడి ఉంది. కెసీఆర్ కుటుంబం, ఆయన బంధు మిత్రులు మాత్రమే ఈ పాలనలో బాగుపడ్డారు. ఈ నాలుగున్నర సంవత్సరాల సమయంలో ప్రజల జీవితాలు ఏమీ బాగుడపలేదు. పెంపకం సరిగా లేకపోతే పిల్లలు చెడిపోతారు. కొత్త రాష్ట్రం అయినా అంతే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల రాజకీయంగా తమకు నష్టం జరిగిందని అన్నారు.

తెలంగాణ ఉద్యమం జరిగిందే నిధులు, నీళ్ళు, నియామకాలు కోసం. కానీ ఈ లక్ష్యాలు ఏమీ నెరవేరలేదు. తెలంగాణ రైతులను కూడా ఈ సర్కారు మోసం చేసింది. మేం ఎంతో కష్టపడి తెచ్చిన భూసేకరణ చట్టాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం నీరుగార్చింది. మేడ్చల్ సభలో మాట్లాడిన సోనియాగాంధీ తన విమర్శల్లో ఎక్కడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ పేరు కూడా ప్రస్తావించలేదు. కేవలం ప్రభుత్వం అని సరిపుచ్చారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం కాంగ్రెస్ తో కూడిన కూటమిని గెలిపించాలని కోరారే తప్ప..పెద్దగా విమర్శలు చేయలేదు.

Next Story
Share it