Telugu Gateway
Andhra Pradesh

షాకింగ్...సీబీఐ వివాదంలో ఏపీ ఐఏఎస్ పేరు

షాకింగ్...సీబీఐ వివాదంలో ఏపీ ఐఏఎస్ పేరు
X

కలకలం రేపుతున్న ఎం కె సిన్హా అఫిడవిట్

దేశాన్ని కుదిపేస్తున్న సీబీఐ వివాదంలో కొత్త మలుపు. తాజాగా ఏపీ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి, సీబీఐ డిఐజి ఎం కె సిన్హా సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిట్ లో ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారిణి రేఖా రాణి పేరును ప్రస్తావించారు. ఆమెతో పాటు ఈ అఫిడవిట్ లో ఓ సారి చాముండేశ్వరి నాధ్ పేరు కూడా ప్రస్తావించటం విశేషం. కాకినాడకు చెందిన పారిశ్రామికవేత్త సానా సతీష్ కేంద్రంగా సాగిన వ్యవహారంలో ఇప్పుడు ఈ పేర్లు కూడా బయటకు రావటం అధికారవర్గాల్లో కలకలం రేపుతోంది. ఓ వైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాను ప్రధాని మోడీపై పోరాటం చేస్తున్నానని చెబుతుంటే..ఈ వ్యవహారంలో ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారిణి పేరు రావటం మరింత దుమారం రేపటం ఖాయంగా కన్పిస్తోంది. సీబీఐ వ్యవహారంపై సుప్రీంకోర్టు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)ని దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించిన తర్వాత జరిగిన పరిణామాలను సిన్హా తన అఫిడవిట్ లో పేర్కొన్నారు.

నీరవ్ మోడీ కేసు విచారణ కోసం లండన్ వెళ్లిన కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శి సురేష్ చంద్ర పలుమార్లు సానా సతీష్ తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగానే ఏపీ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారిణి రేఖారాణిని సంప్రదించారు. సురేష్ చంద్ర లండన్ నెంబర్ ను ఎలాగోలా సతీష్ సానాకు అందజేశారు అయితే సానా సతీష్ నవంబర్ 8న లండన్ లో ఉన్న కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శి సురేష్ చంద్రతో వాట్సప్ కాల్ లో మాట్లాడారు. ఈ సమయంలో సురేష్ చంద్ర సానా సతీష్ కు కేబినెట్ కార్యదర్శి పి కె సిన్హా చెప్పమన్న సందేశాన్ని తెలియచేశారని..కేంద్రం ఆయనకు పూర్తి రక్షణ కల్పిస్తుందని హామీ ఇచ్చినట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. అదే సమయంలో నవంబర్ 13,14 తేదీల్లో ఢిల్లీలో సురేష్ చంద్రను కలవాలని సూచించారు.

చివరకు సానా సతీష్ కదలికలను ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా కనిపెట్టలేకపోయిందని..చివరకు లండన్ లోని హోటల్ లో సురేష్ చంద్రను కలసిన చాముండేశ్వరి నాథ్ ద్వారా సమాచారాన్ని సానా సతీష్ కు చేరవేశారు. సానా ఫోన్ చేస్తానని హామీ ఇచ్చారు. తిరిగి సురేష్ చంద్ర నవంబర్ 13న సానా సతీష్ ఎక్కడ ఉన్నారనే వివరాలపై రేఖా రాణిని ఆరా తీశారు. సిన్హా తన అఫిడవిట్ లో ఏకంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పేరును కూడా లాగారు. దోవల్ తో పాటు కేంద్ర మంత్రి హరిభాయ్ పార్తిబాయ్ చౌదరి, సీవీసీ కె వి చౌదరి కూడా రాకేష్ ఆష్థానాపై జరిగే విచారణలో జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. దీంతో సీబీఐ వివాదం మరింత జఠిలంగా మారే పరిస్థితి కనపడుతోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పేరు కూడా ఈ అఫిడవిట్ లో ఉంది.

Next Story
Share it