Telugu Gateway
Telangana

కాంగ్రెస్ కు రెబెల్స్ టెన్షన్

కాంగ్రెస్ కు రెబెల్స్ టెన్షన్
X

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆశపడుతున్న కాంగ్రెస్ పార్టీకి ‘రెబెల్స్’ టెన్షన్ స్టార్ట్ అయింది. మహాకూటమి ఏర్పాటు కారణంగా పొత్తులో పోతున్న సీట్లలో ‘మేం బరిలో ఉంటాం’ అంటూ పలువురు నేతలు రంగంలోకి దిగటంతో కాంగ్రెస్ పార్టీకి ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ఓ వైపు ఫైనల్ జాబితా ఇంకా రాక ముందే ఏకంగా నలభై మంది అభ్యర్దులు రెబెల్స్ గా బరిలో ఉంటామని చెబుతుండటంతో ఆ పార్టీ నేతలు ఆందోళనకు గురవుతున్నాయి. అయితే ఇందులో ఎంత మందిని అధిష్టానం బుజ్జగించి దారిలోకి తెచ్చుకోగలదో వేచిచూడాల్సిందే. నామినేషన్ల ఉపసంహరణ నాటికి ఈ వేడిని కాస్త అయినా తగ్గించగలిగితేనే ఉపయోగం ఉంటుందని..ఎక్కువ మంది అభ్యర్ధులు రెబెల్స్ గా ఉంటే మాత్రం నష్టపోవాల్సి వస్తుందని చెబుతున్నారు. టిక్కెట్ ఆశించి అవకాశం దక్కించుకోలేని వారంతా ఒక కూటమిగా ఏర్పడటం విశేషం. ఇందులో మొత్తం 40 వరకూ ఉన్నారని చెబుతున్నారు. హైదరాబాద్ లోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాజీమంత్రి విజయరామారావు, రవీందర్‌, బోడ జనార్ధన్‌ కాంగ్రెస్‌ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, కుంతియా ముగ్గురూ కూటమిగా ఏర్పడి మహాకూటమి పేరుతో మాయ చేశారని మండిపడ్డారు.

‘మా నలభై మంది గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం. టికెట్లు అమ్ముకున్నారు కాబట్టే.. చివరి నిముషంలో కాంగ్రెస్‌లో చేరిన 19 మందికి సీట్లిచ్చారు. పారచూట్ నేతలు, నాలుగు సార్లు ఓడిన నేతలకు టికెట్లిచ్చారని విజయరామారావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక రాహుల్‌ గాంధీ ప్రిన్సిపల్స్‌ కు అనుగుణంగానే జరిగిందా అని ఆయన టీపీసీసీ నేతలను ప్రశ్నించారు. పార్టీలో కనీసం ప్రాథమిక సభ్యత్వం లేనివారికి కూడా సీట్లెలా కేటాయించారని మండిపడ్డారు. ధర్మపురి టికెట్‌ ఆశించిన కాంగ్రెస్‌ నేత రవీందర్‌ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. నాలుగు సార్లు పోటీ చేసి ఓడిన వారికి కూడా టికెట్లెలా ఇస్తారని ప్రశ్నించారు. ‘మా ధర్మపురిలో నాలుగు సార్లు ఓటమిపాలైన వారికి టికెట్‌ ఇచ్చారు. ప్రజల్లో సానుభూతి అంటే.. ఒకటి రెండు సార్లు మాత్రమే ఉంటుంది. అయిదో సారి కూడా ఉంటుందా’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను ముంచేలా ఉత్తమ్‌ వ్యవహరించాడని ఆరోపించారు. కాంగ్రెస్‌ రెబల్స్‌ ఫ్రంట్‌ తరపున ధర్మపురి నుంచి పోటీకి దిగుతానని రవీందర్‌ స్పష్టం చేశారు.

Next Story
Share it