Telugu Gateway
Telangana

టీఆర్ఎస్..కాంగ్రెస్ రెండూ కుటుంబ పార్టీలే

టీఆర్ఎస్..కాంగ్రెస్ రెండూ కుటుంబ పార్టీలే
X

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ పై ప్రధాని నరేంద్రమోడీ విమర్శలు గుప్పించారు. కెసీఆర్ ఏ పని కూడా పూర్తిగా చేయరని..మాటలు అంతే..హామీలు అంతే..చివరకు ఐదేళ్ళు ఉండాల్సిన ప్రభుత్వాన్ని కూడా మధ్యలోనే వదిలేశారని ఎద్దేవా చేశారు. అయితే ఈ ప్రభుత్వాన్ని తొందరగా ఇంటికి పంపే అవకాశం వచ్చినందుకు సంతోషించాలన్నారు మోడీ. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మంగళవారం నాడు బిజెపి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత మోడీ నిజామాబాద్ బహిరంగ సభలో మాట్లాడారు. ముఖ్యంగా ఆయన అధికార టీఆర్ఎస్ నే టార్గెట్ చేశారు. పనిలో పనిగా సోనియాగాంధీ తెలంగాణ పర్యటనను కూడా ప్రస్తావించారు. ఒకే వేదికపై సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పక్కపక్కనే కూర్చుని తెలంగాణ సర్కారును కుటుంబ పాలన అని విమర్శించారని..ఇంత కంటే హస్యాస్పదం ఉంటుందా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ లు రెండూ కుటుంబ పార్టీలే అని విమర్శించారు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి సోనియా సారధ్యంలోని యూపీఏ హయాంలో రిమోట్ కంట్రోల్ పాలనలో కేంద్ర మంత్రిగా పనిచేసి..ఆ సర్కారు ఉప్పు తిన్నారని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకటే అని విమర్శించారు. నిజామాబాద్ ను కెసీఆర్ లండన్ చేస్తానని హామీ ఇచ్చారని..నిజంగా ఎలా అభివృద్ధి చేశారో చూద్దామని తాను హెలికాప్టర్ లో ఓ సారి అలా తిరిగి చూశానని..కానీ వెనకబడిన ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి ఇక్కడ ఉందని అన్నారు. ఎన్నికల తర్వాత ఓ సారి లండన్ వెళ్లి ఓ ఐదేళ్ళు అక్కడే ఉండి ఎలా ఉంటుందో చూసిరావాలని వ్యాఖ్యనించారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ పథకాన్ని అడ్డుకుని ముఖ్యమంత్రి కెసీఆర్ తెలంగాణ ప్రాంతంలోని పేదలకు అన్యాయం చేశారని విమర్శించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణను కెసీఆర్ నష్టం చేశారన్నారు. దీనికి కారణం కెసీఆర్ కాంగ్రెస్ లో అప్రెంటిస్ చేయటమే అని తెలిపారు. మరోసారి టీఆర్ఎస్ కు అవకాశం ఇస్తే మరింత నష్టం జరుగుతుందని తెలిపారు. బిజెపి వల్లే దేశంలో అభివృద్ధి సాధ్యం అవుతుందని తెలిపారు. బిజెపి అభ్యర్ధులను గెలిపించాలని కోరారు.

Next Story
Share it