Telugu Gateway
Politics

కాంగ్రెస్ తో పొత్తు..ఎన్టీఆర్ బయోపిక్ స్క్రిప్ట్ లో మార్పులు?!

కాంగ్రెస్ తో పొత్తు..ఎన్టీఆర్ బయోపిక్ స్క్రిప్ట్ లో మార్పులు?!
X

తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటం ఆ పార్టీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణకు పెద్ద చిక్కులే తెచ్చిపెట్టింది. ఆయన ఇప్పుడు సొంత బ్యానర్ పై రెండు భాగాలుగా ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒక భాగం కథానాయకుడు అయితే..మరో భాగం మహా నాయకుడు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఆయన ప్రధానంగా టార్గెట్ చేసింది కాంగ్రెస్ పార్టీనే. ఎందుకంటే అప్పటికి అధికారంలో ఉన్న పార్టీ అదే కావటం..కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసుగెత్తి ఉండటంతో పాటు ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవ నినాదాన్ని అందుకోవటంతో ప్రజలు ఆయనకు బాగా కనెక్ట్ అయ్యారు. కాంగ్రెస్ ను దూషించటంలో ఆయన ఓ కొత్త వరడిని సృష్టించారు. కాంగ్రెస్ పార్టీని ఎన్టీఆర్ దుష్ట కాంగ్రెస్ అనటంతో పాటు..ఆ పార్టీ నేతలను కుక్కమూతి పిందెలు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా మొదలుపెట్టే నాటికి బాలకృష్ణకు ఎలాంటి సమస్య లేదు. కానీ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే చంద్రబాబు రాజకీయంగా బద్ధ విరోధి అయిన కాంగ్రెస్ తో చేతులు కలపటంతో బాలకృష్ణకు చిక్కు వచ్చి పడింది.

దుష్ట కాంగ్రెస్. కుక్కమూతి పిందెలు వంటి అంశాలను ఇప్పుడు సినిమాలో జోడిస్తే రాజకీయంగా ఇది అటు తెలుగుదేశానికి..ఇటు కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిణామంగా మారే అవకాశం ఉండటంతో స్క్రిప్ట్ లో మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ను తిట్టాల్సిన ప్రతి చోటా ‘కేంద్రం’ అంటూ పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఓ దశలో ఎన్టీఆర్ కేంద్రం మిథ్య అంటూ వ్యాఖ్యానించారు. చివరకు బాలకృష్ణకు ఎన్టీఆర్ ‘మిథ్య’ అన్న కేంద్రమే కాపాడుతున్నట్లు ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ ప్రకటించినప్పటి నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన్ను పదవీచ్యుడిని చేసే సన్నివేశాలు ఉంటాయా? ఉండవా అన్న చర్చ జోరుగా సాగిన సంగతి తెలిసిందే. అయితే బాలకృష్ణ మాత్రం సినీ రంగం నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టి తొలిసారి ఎన్టీఆర్ సీఎం అయిన ఘట్టంతోనే సినిమాను క్లోజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు ఎన్టీఆర్ బయోపిక్ కు కొత్త సమస్యను తెచ్చిపెట్టినట్లు అయింది. మరి ఇన్ని కీలక అంశాలను తొలగించి సినిమాను తెరకెక్కిస్తే అది ప్రజలకు కనెక్ట్ అవుతుందా?. వేచిచూడాల్సిందే.

Next Story
Share it