Telugu Gateway
Politics

కొత్త మలుపు తిరుగుతున్న తెలంగాణ రాజకీయం!

కొత్త మలుపు తిరుగుతున్న తెలంగాణ రాజకీయం!
X

ఎన్నికల నోటిఫికేషన్ కు ముహుర్తం ముంచుకొస్తున్న వేళ తెలంగాణ రాజకీయం రంజుగా మారుతోంది. ఇంత కాలం అధికార టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్, టీడీపీలను టార్గెట్ చేస్తూ ముందుకు సాగింది. అది ఎక్కడ వరకూ వెళ్లింది అంటే..మహాకూటమి అధికారంలోకి వస్తే ఏకంగా సాగునీటి శాఖ, హోం శాఖలు టీడీపీకి వెళతాయని టీఆర్ఎస్ అగ్రనేతలంతా ప్రచారం చేశారు. అంతే కాదు..తెలంగాణ నిర్ణయాలు ఢిల్లీలో, అమరావతిలో జరుగుతాయంటూ హడావుడి చేశారు. కానీ అదే బిజెపి టిక్కెట్లను ఢిల్లీలో బిజెపి అధిష్టానం ఖరారు చేస్తుంటే ఆ పార్టీని గురించి మాత్రం నోరెత్తటం లేదు. కేవలం కాంగ్రెస్ టిక్కెట్లు ఒక్కటే ఢిల్లీలో ఖరారు అవుతున్న కలరింగ్ ఇచ్చారు టీఆర్ఎస్ నేతలు. దీని వెనక ప్రధాన ఉద్దేశం మహాకూటమి గెలిస్తే తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందనే అభిప్రాయం కల్పించే ప్రయత్నం చేశారు.

అకస్మాత్తుగా గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్ధిగా ఒంటేరు ప్రతాప్ రెడ్డి తెరపైకి వచ్చి ఏకంగా ఆపద్ధర్మ సీఎం కెసీఆర్ ను ఓడించాలని మంత్రి హరీష్ రావు తనకు ఫోన్ చేశారని..అంతే కాదు..ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారని ప్రకటించటంతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. మరింత కొనసాగింపుగా హరీష్ రావు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారని ప్రకటించి పెద్ద దుమారం రేపారు. తనకు ఫోన్ చేసిన అంశంపై ఎక్కడ ప్రమాణం చేయటానికి అయినా రెడీ అని ఒంటేరు ప్రతాపరెడ్డి ప్రకటించటం మరింత దుమారం రేపింది. అయితే మంత్రి హరీష్ రావు వెంటనే రంగంలోకి దిగి ఒంటేరు ప్రతాపరెడ్డి వ్యాఖ్యలను ఖండించారు.

అంతే కాదు..ఆరోపణలకు ఆధారాలు ఉంటే బహిరంగపర్చాలని కోరారు. అంతే కాదు..ఒంటేరు ప్రతాప్ రెడ్డిపై పోలీసు స్టేషన్ లో కేసు కూడా పెట్టారు. మొత్తానికి ఒంటేరు ప్రతాప్ రెడ్డి వ్యాఖ్యలు టీఆర్ఎస్ ను షాక్ కు గురిచేశాయి. ఒంటేరు వ్యాఖ్యలు నిజమా? కావా అనే అంశాన్ని పక్కన పెడితే మహాకూటమి అధికారంలోకి వస్తే టీడీపీకి సాగునీటి శాఖ, హోం శాఖలు ఇస్తారని, రిమోట్ పాలన సాగుతుందని ప్రకటించటం మాటేమిటి?. అంటే పక్క పార్టీల పోర్ట్ పోలియోలను టీఆర్ఎస్, ఆ పార్టీ నేతలు ఖరారు చేస్తారా?. అనే అనుమానం రావటం సహజమే. మొత్తానికి రాబోయే రోజుల్లో ఈ పరస్పర బురదజల్లుడు రాజకీయం మరింత పెరగటం ఖాయంగా కన్పిస్తోంది.

Next Story
Share it