Telugu Gateway
Politics

ఖర్చుపరంగా సేఫ్ జోన్ లో ‘మహాకూటమి’!

ఖర్చుపరంగా సేఫ్ జోన్ లో ‘మహాకూటమి’!
X

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ ప్లాన్ కు మహాకూటమి నేతలు విరుగుడు ఆలోచించారా?. అంటే అవుననే అంటున్నారు కూటమి నేతలు. అసెంబ్లీ రద్దు అయిన రోజే ఏకంగా 105 సీట్లను ప్రకటించి తమను ట్రాప్ లోకి లాగాలని కెసీఆర్ ప్రయత్నించారని..అయితే తాము ఆ ట్రాప్ నుంచి విజయవంతంగా బయటపడగలిగామని కూటమి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. లేదంటే ఇప్పటికే తమ అభ్యర్ధుల వద్ద ఉన్న డబ్బు అంతా అయిపోయేదని..ఎన్నికల సమయానికి చేతులెత్తేయాలసి వచ్చేదని చెబుతున్నారు. గతంలో ఎప్పుడు చూసినా టిక్కెట్ల ఖరారు చివరి నిమిషంలోనే సాగేదని..దీని వల్ల ప్రచారంలో కొంత వెనకబడినా కీలక సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే మాత్రం విజయం సాధించటం పెద్ద కష్టం కాబోదని చెబుతున్నారు. అధికార పార్టీ చాలా ముందుగానే టిక్కెట్లను ప్రకటించటం వల్ల వాళ్ళకు ఖర్చు తడిసిమోపెడు అవుతుందని..ప్రతిపక్షంలో ఉన్న తమకు ఆ పరిస్థితి ఉండదని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

ఎలా చూసుకున్నా అధికార పార్టీ ఆర్థిక బలం ముందు మహాకూటమి అభ్యర్ధులు నిలబడలేరని..అయినా చివరి నిమిషంలోనే సీన్ అంతా ఉంటుంది కాబట్టి కొంత కొంతలో సేఫ్ జోన్ లో ఉన్నట్లే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు మాత్రం తమ స్థానాల్లో ప్రచారం చేసుకుంటూ వెళుతున్నారు. సమస్య అంతా టిక్కెట్ల ఖరారు కాని చోట్ల..భాగస్వామ్య పార్టీలకు సంబంధించి మాత్రమే. దీపావళి తర్వాత అన్ని పార్టీల జాబితాలు వెలువడటం ఖాయంగా కన్పిస్తోంది. ఇక అప్పటి నుంచి మార్కెట్లోకి నగదు ప్రవాహం ‘కట్టలు’ తెంచుకోనుంది. మహాకూటమి తరపున అన్ని సీట్లు ఒకేసారి ప్రకటించే అవకాశం లేకపోయినా..మెజారిటీ స్థానాలు ప్రకటించే అవకాశం ఉందని..అయినా కావాలనే వెనక్కితగ్గినట్లు చెబుతున్నారు.

Next Story
Share it