Telugu Gateway
Politics

కాంగ్రెసోళ్ళు ఆ దరిద్రాన్ని మన నెత్తిన పెడుతుండ్రు

కాంగ్రెసోళ్ళు ఆ దరిద్రాన్ని మన నెత్తిన పెడుతుండ్రు
X

‘వెళ్లగొట్టిన ఆ దరిద్రాన్ని కాంగ్రెసోళ్ళు మళ్లీ మన నెత్తిన పెడతామంటున్నరు. ఇంకా మనకు చంద్రబాబు పాలన కావాలా?’ అని టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెసోళ్ళకు తనను ఓడించటం చేతకాక చంద్రబాబును సాయం తెచ్చుకుంటున్నారని విమర్శించారు. కెసీఆర్ శుక్రవారం నాడు పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎప్పటిలాగానే చంద్రబాబునే టార్గట్ చేశారు. అదే సమయంలో ప్రధాని నరేంద్రమోడీపై కూడా విమర్శలు చేశారు. మోడీ..ఓ రోగం ఉందని..అది హిందూ, ముస్లిం రోగం అని వ్యాఖ్యానించారు. ఈ కారణంగానే ముస్లిం రిజర్వేషన్లు, ఎస్టీల రిజర్వేషన్లు కూడా ఆగిపోయారన్నారు. దేశానికి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి చేసిందేమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తుందని..అప్పుడు ఈ రిజర్వేషన్లు అన్నీ అమలు అవుతాయని తెలిపారు. మన ఆకాంక్షలు నెరవేరాలంటే తెలంగాణలోని ఎంపీ సీట్లు అన్నీ టీఆర్ఎస్ గెలవాలన్నారు. ఎవరిని గెలిపిస్తే ప్రజలకు మేలు జరుగుతుందో వారినే గెలిపించాలని కెసీఆర్ ప్రజలను కోరారు. ఎన్నికలనగానే చాలా మంది వచ్చి చాలా చెబుతుంటారని, కానీ ప్రజలే రాష్ట్రానికి మంచి ఏదో ఆలోచించి ఓటేయాలన్నారు. ఎన్నికలనగానే ఆగం కావద్దని, 58 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌, టీడీపీలు.. 14 ఏళ్లు తెలంగాణ కోసం పోరాడి.. రాష్ట్రాన్ని సాధించిన టీఆర్‌ఎస్‌లు బరిలో నిలిచాయన్నారు.

‘నాయకులు వస్తుంటారు పోతుంటారు. ఎవరికి ఓటు వేయాలో జనమే విజ్ఞతతో ఆలోచించాలి. గతంలో తెలంగాణోళ్లకు తెలివి లేదని ఎద్దేవ చేసిన సమైక్యపాలకుల రాష్ట్రం కంటే మనం అభివృద్ధి సాధించాం. 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌, టీడీపీ హయాంలో ఏం జరిగాయో.. టీఆర్‌ఎస్‌ నాలుగేళ్ల పాలనలో ఏం జరిగిందో మీకు తెలుసు. 24 గంటలు కరెంట్‌ ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇవాళ 24 గంటల కరెంట్‌ లేదు. కరెంట్‌ తలసరి వినియోగంలో దేశంలోనే నెంబర్ 1గా ఉన్నాం. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, పెన్షన్లతో పాటు బీడీ కార్మీకులకు, బోధకాలు బాధితులకు పెన్షన్‌లిస్తున్నాం. అధికారంలోకి రాగానే ఈ పెన్షన్‌లను రెండింతలు చేస్తాం. రైతు బంధులాంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఐక్యరాజ్య సమితి గుర్తించిన 10 పథకాల్లో రైతు బంధు ఒకటి. రైతు భీమాను గుంట భూమి ఉన్న రైతుకు కూడా వర్తింపజేస్తున్నాం.

ఇచ్చిన మాట ప్రకారం డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కట్టి తీరుతాం. అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టం. కాంగ్రెస్‌ నేతల అవినీతిని కక్కిస్తాం. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో బీడుభూముల సమస్యలను పరిష్కరిస్తాం. తండాలను గ్రామపంచాయితీలుగా చేసినం. దీంతో గిరిజన సోదరులు గ్రామ సర్పంచ్‌లుకానున్నారు. రిజర్వేషన్లను పెంచాలని కేంద్రంతో కొట్లాడినం. అవి కూడా సాధిస్తాం. నర్సంపేటలో గత ఎన్నికల్లో దయ చూపలేదు. అయినా అన్ని పథకాలు కొనసాగించాం. ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అభివృద్ధి నిధులు కేటాయించాం. 2001 నుంచి పెద్ది సుదర్శన్‌ రెడ్డి పార్టీలో ఉండి కష్టపడుతున్నారు. ఆయనకు ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాడు. ఈ సారి సుదర్శన్‌రెడ్డిని గెలిపించాలి.’ అని కేసీఆర్‌ ప్రజలకు కోరారు.

Next Story
Share it