Telugu Gateway
Politics

కెసీఆర్ ‘కొంపలు అంటుకోవు’ వ్యాఖ్యలపై కలకలం!

కెసీఆర్ ‘కొంపలు అంటుకోవు’ వ్యాఖ్యలపై కలకలం!
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ సోమవారం నాడు ఖమ్మంజిల్లా పర్యటన సందర్భంగా చేసిన ‘కొంపలు అంటుకోవు’ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఆరు నెలల ఆలశ్యం అయితే కొంపలు ఏమీ అంటుకోవు అని కెసీఆర్ వ్యాఖ్యానించారు. ఇది ఎక్కడ తమకు నష్టం చేస్తుందో అన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తం అవుతోంది. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అన్నీ అమలు చేసిందని..కొంత మంది దళితులకు మూడెకరాల హామీ, డబుల్ బెడ్ రూం ఇళ్ల గురించి ప్రశ్నిస్తున్నారంటూ కెసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పేదలకు టీఆర్ఎస్ సర్కారు డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో ఎన్నో ఆశలు రేకెత్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇళ్ల కోసం లక్షలాది దరఖాస్తులు వచ్చాయి. కానీ ఇప్పటివరకూ పూర్తయినవి వేలల్లోనే ఉన్నాయి. అంతే కాదు కెసీఆర్ ఓ కొత్త లాజిక్ ను కూడా తెరపైకి తెచ్చారు. తాము ఒక ఇళ్లు ఇస్తే అది కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన 7 ఇళ్ళకు సమానం అంటూ కొత్త వాదన తెరపైక తెచ్చారు. అసెంబ్లీ రద్దు తర్వాత టీఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడిన సమయంలో విలేకరులు డబుల్ బెడ్ రూం ఇళ్ళ గురించి ప్రస్తావించినప్పుడు కూడా కెసీఆర్ ఇదే రీతిలో మండిపడ్డారు.

మీకు తెలుసా?. ఇదేమీ ప్రశ్న. ఇళ్ళు ప్రారంభం అయ్యాయి. పూర్తవుతాయి. ఏం ప్రశ్నలు అడుగుతారు అంటూ మీడియాపై తీవ్ర అసహనం ప్రదర్శించారు. మిషన్ భగీరథ కింద ఇంటింటికి నళ్ళాతో నీరు సరఫరా చేయకుండా అసలు ఓట్లే అడగను అని ప్రకటించిన కెసీఆర్ ఈ హామీని కూడా అమలు చేయకుండా ఎన్నికల బరిలో దిగిపోయారు. గుండుగుత్తగా నీటి సరఫరాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి కానీ..ఇంటింటికి నల్లాలు ఫిట్ చేయాల్సిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు. అయితే విపక్షాలు అన్నీ ఇంకా తొమ్మిది నెలల పదవీ కాలం ఉండగానే ఏం కొంపలు అంటుకుపోతున్నాయని అసెంబ్లీని రద్దు చేసి..ముందస్తుకు వెళ్ళాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నాయి. సీఎం కెసీఆర్ దీనికి విచిత్రంగా ప్రతిపక్షాలను సాకుగా చూపించంపై ఓటర్లు విస్మయం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది.

Next Story
Share it