Telugu Gateway
Politics

సంక్షేమం సాగాలంటే..టీఆర్ఎస్సే మళ్ళీ రావాలి

సంక్షేమం సాగాలంటే..టీఆర్ఎస్సే మళ్ళీ రావాలి
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ ఎన్నికల సుడిగాలి సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రతి చోటా కెసీఆర్ మాట ఒకటే. సంక్షేమం కొనసాగాలంటే టీఆర్ఎస్ పార్టీనే మళ్ళీ అధికారంలోకి రావాలని.. ఈ విషయంలో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. అన్ని పార్టీలు ఎవరి వాదన వారు చెబుతున్నారని..కానీ అంతిమంగా ఏది మేలు చేస్తుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కెసీఆర్ కోరారు. సోమవారం కెసీఆర్ కరీంనగర్‌, జగిత్యాల నియోజకవర్లాల్లో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని మాట్లాడారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించబోతోందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. నాలుగేళ్ల తమ పాలనలో సంపద పెంచి పేదలకు పంచామని, 17.17 శాతం అభివృద్ధితో తెలంగాణ.. దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి అదే స్థాయిలో జరగాలన్నా.. సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా.. టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.

తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు చేశారని, అలాంటి బాబుతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్‌ వలసాధిపత్యాన్ని తిరిగి తెలంగాణపై రుద్దే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రజలు ఆగమాగం కాకుండా ఆలోచించి ఓటేయ్యాలని సూచించారు. పోటీ కేవలం టీడీపీ - కాంగ్రెస్ కూటమి, టీఆర్‌ఎస్‌కు మాత్రమేనని, మిగతా వాళ్ల గురించి అవసరం లేదన్నారు. టీడీపీ-కాంగ్రెస్‌లు కలిపి 58 ఏండ్లు పాలించాయని, వారి పాలనలో కరెంట్ ఎట్లా ఉందో. ఇప్పుడు ఎట్ల ఉందో ఆలోచించాలన్నారు. మిషన్‌ భగీరథ మరో నెలరోజుల్లో పూర్తి కాబోతుందని, రాబోయే రోజుల్లో విద్యా విధానంలో సమూల మార్పులు తెస్తామన్నారు. జగిత్యాల, కరీంనగర్‌ టీఆర్‌ఎస్ అభ్యర్థులు సంజయ్ కుమార్‌, గంగుల కమలాకర్‌లను భారీ మెజార్టీతో గెలిపించాలని కెసీఆర్ కోరారు.

Next Story
Share it