Telugu Gateway
Politics

కళ్యాణ్ రామ్ తో మీడియా అధినేత రాయభారం ఫెయిల్!

కళ్యాణ్ రామ్ తో  మీడియా అధినేత రాయభారం ఫెయిల్!
X

సుహాసిని ప్రచారానికి జూనియర్..కళ్యాణ్ రామ్ దూరం

మద్దతు లేఖతోనే సరి?!

తెలంగాణ ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ కుమార్తెను కూకట్ పల్లి నియోజకవర్గం బరిలో నిలపటం వెనక కారణం ఏంటి?. దీని వెనక ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి స్ట్రాటజీ ఉందా?. తొలుత నందమూరి కళ్యాణ్ రామ్ ను బరిలోకి దించాలని ప్లాన్ చేశారు. దీని కోసం ఓ మీడియా అధినేత రాయభారం నడిపారు. అయితే ఎన్నికల్లో పోటీ ప్రతిపాదనను కళ్యాణ్ రామ్ సున్నితంగా తిరస్కరించారు. తర్వాత ప్లాన్ మార్చి సుహాసినిని తెరపైకి తెచ్చారు. తెలంగాణ ఎన్నికల బరిలో సుహాసిని నిలబడటం అటు జూనియర్ ఎన్టీఆర్, ఇటు కళ్యాణ్ రామ్ కు ఏ మాత్రం ఇష్టం లేదని చెబుతున్నారు. అయినా సరే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యూహాం ప్రకారం ఆమెను బరిలోకి దింపారు. దీని వల్ల ఆయన పలు రకాల ప్రయోజనాలు ఆశిస్తున్నారు. సుహాసిని కూకట్ పల్లిలో గెలిస్తే హరికృష్ణ ఫ్యామిలీకి పార్టీలో ప్రాముఖ్యత ఇచ్చామని చెప్పుకోవచ్చు. ఒక వేళ పరాజయం పాలైతే హరికృష్ణ ఫ్యామిలీకి ఆదరణ లేదని..ఎన్నికల్లో అవకాశం కల్పించినా ఉపయోగించుకోలేకపోయారని చెప్పొచ్చు. హరికృష్ణ జీవించి ఉన్నంత కాలం ఆయన్ను విస్మరించి..ఇప్పుడు ప్రేమ ఒలకబోయటం ఏమిటనే అభిప్రాయంతో సోదరులిద్దరూ ఉన్నారు.

చంద్రబాబు రాజకీయాలను దగ్గర నుంచి చూసిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు మాత్రం ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ట్విట్టర్ ద్వారా తెలిపిన సంఘీభావ లేఖతోనే సరి. ఆ లేఖలో కూడా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఎక్కడా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పేరు ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారు. తాత పెట్టిన పార్టీ పవిత్రమైనది అంటూ..తన తండ్రి పనిచేసిన తెలుగుదేశం అన్నారే తప్ప..ఎక్కడా ప్రస్తుత అధ్యక్షుడు చంద్రబాబునాయుడి ఊసెత్తలేదు. సుహాసిని తరపున తాము ప్రచారం చేసి, ఆమె గెలిచినా కూడా క్రెడిట్ ఎలాగూ చంద్రబాబు తన ఖాతాలోనే వేసుకుంటారు. ఎన్టీఆర్ ఎలాగూ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా బిజీలో ఉన్నారు. ఈ నెలాఖరు నుంచి సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. అందుకే అన్నదమ్ములిద్దరూ కలసి అక్కను అభినందించి..విజయం వరించాలనే ఆకాంక్షతో కూడిన లేఖను అందజేసి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Next Story
Share it