Telugu Gateway
Politics

ఏపీలో చెల్లని బాబు..తెలంగాణలో చెల్లుతారా?

ఏపీలో చెల్లని బాబు..తెలంగాణలో చెల్లుతారా?
X

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో రుణమాఫీ అమలు చేయటంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబును పక్కన పెట్టుకుని తెలంగాణలో రెండు లక్షల రూపాయల రుణ హమీ ఇస్తే ఎవరైనా నమ్ముతారా? అని హరీష్ ప్రశ్నించారు. చంద్రబాబుది అవే కళ్ళు..అవే సిద్ధాంతాలు అని ఎద్దేవా చేశారు. గురువారం తెలంగాణ భనవ్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఆ సమావేశంలోని ముఖ్యాంశాలు...‘2014 లో మేనిఫెస్టో లో ఏపీ లో పెట్టిన హామీలు చంద్రబాబు ఇప్పటికీ నెరవేర్చ లేదు. మేనిఫెస్టో లు అమలు చేయని కాంగ్రెస్ ,టీడీపీ లు ఒక్కటయ్యాయి. ఇది ప్రజా కూటమి కాదు దగా కూటమి. కాంగ్రెస్ అమలు చేయని హామీలను మేము అమలు చేశాం. ఏపీ లో చంద్రబాబు చెల్లని రూపాయి అని అక్కడి కాంగ్రెస్ నేతలు చార్జ్ షీట్ వేశారు ..అక్కడ పనికి రాని బాబు తెలంగాణ లో ఎలా పనికొస్తారో రాహుల్ చెప్పాలి .

అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తామన్న చంద్రబాబు ను పక్కన పెట్టుకుని రాహుల్ రుణ మాఫీ అంటే ఎవరు నమ్ముతారు ? తెలంగాణ చైతన్యం ఉన్న ప్రాంతం ..ఇలాంటి మోసాలను సహించదు. చంద్రబాబు 600 హామీలు ఇస్తే వాటిలో పది పైసలు కూడా అమలు చేయలేదు. హైదరాబాద్ లో పర్యటిస్తున్న చంద్రబాబు ఏపీ లో ఇచ్చిన హామీల వైఫల్యం పై సమాధానం చెప్పాలి. డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానన్న బాబు ఏం చేయక మహిళలను మోసం చేశారు. చంద్రబాబు కు విశ్వసనీయత లేదు ..కాంగ్రెస్ ఆంటే ప్రజల్లో విశ్వాసం లేదు. తెలంగాణ ప్రజల్లో విశ్వసనీయత ఉన్న నాయకుడు ఒక్క కెసిఆర్ మాత్రమే. కెసిఆర్ నే తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. దగా కూటమి ని ప్రజలు తిరస్కరిస్తారు. రాహుల్ ప్రాణహిత చేవెళ్ల పై అబద్దాలు చెబుతున్నారు. స్థానిక నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారం గా రాహుల్ మాట్లాడారు ..డాన్ని ఇప్పటికైనా సవరించుకోవాలి. ఆయకట్టు రెండున్నర రెట్లు పెరిగింది కాబట్టే కాళేశ్వరం అంచనా వ్యయం పెరిగింది.గోదావరి జలాల పై చంద్రబాబు చిలుక పలుకులు పలుకుతున్నారు. రెండు రాష్ట్రాలు గోదావరి జలాల వాడుకోవాలనుకుంటున్న చంద్రబాబు కాళేశ్వరం కు వ్యతిరేకంగా లేఖ రాశారు.

ఖమ్మం మీటింగ్ చారిత్రాత్మకమని చంద్రబాబు అనడం సిగ్గు చేటు ..అదొక చారిత్రక వైఫల్యం. తెలంగాణ కు అడ్డు పడలేదని బాబు అనడం కన్నా జోక్ మరొకటి ఉండదు. చంద్రబాబు కు ఉన్నన్నీ నాలుకలు ,తలలు దేశం లో మరే రాజకీయ నాయకుడికి లేవు. వెన్నులో బుల్లెట్ దించిన బాబు తో గద్దర్ కలవడాన్ని తెలంగాణ సమాజం జీర్ణించుకోదు. ఉన్న గౌరవాన్ని కూడా గద్దర్ పోగొట్టుకున్నారు. కోదండరాం కెసిఆర్ ను గాయపడ్డ బ్యాట్స్ మన్ అంటున్నారు. డిసెంబర్ 11 న కెసిఆర్ సిక్సర్లు కొడుతుంటే కోదండరామ్ చప్పట్లు కొట్టాల్సిందే. టికెట్ దక్కించుకొని కోదండరాం ఆత్మ కుళ్లిపోయి ఉంటుంది. ఒకప్పుడు నరహంతకుడన్న బాబు తోనే కోదండరాం కలిశాడు. కోదండరాం ను అవమానించిన కాంగ్రెస్ ,టీడీపీ లతోనే ఆయన కలిశాడు. ఓట్ల కోసం ఇంతకు దిగజారుతారా ?’ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Next Story
Share it