Telugu Gateway
Andhra Pradesh

‘అగ్రిగోల్డ్’ లో ‘గోల్డ్ మిస్!..దీని వెనక ఉన్నది ఎవరు?.

‘అగ్రిగోల్డ్’ లో ‘గోల్డ్ మిస్!..దీని వెనక ఉన్నది ఎవరు?.
X

సాక్ష్యాత్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అగ్రిగోల్డ్ స్కామ్ పై ఎన్నో సమావేశాలు పెట్టారు. ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అయితే అసలు అగ్రిగోల్డ్ బాధితులకు తాము తప్ప..ఎవరూ న్యాయం చేయలేరని మీడియా మందుకు వచ్చి పలుమార్లు రెచ్చిపోయారు. ఓ వైపు ఏపీ ప్రభుత్వం సీఐడీ విచారణ చేస్తుందని చెప్పారు. విచారణ తుది దశకు వచ్చిందని చెప్పి..చివరి నిమిషంలో అగ్రిగోల్డ్ మొత్తం ఆస్తుల్లో ‘గోల్డ్ మైన్’ వంటి హాయ్ లాండ్ లేదని సాక్ష్యాత్తూ కోర్టు ముందు చెప్పటంలో ఔచిత్యం ఏమిటి?. అసలు ఇది సాధ్యమయ్యే పనేనా?. జీ గ్రూప్ నకు చెందిన సుభాష్ చంద్ర కంపెనీ ఈ ఆస్తులు కొనుగోలు చేయటానికి ముందుకొచ్చినప్పుడు హాయ్ ల్యాండ్ ఉందా? లేదా?. కేసు కొలిక్కి వస్తుందని బాధితులను ఇంత కాలం నమ్మిస్తూ వచ్చిన సర్కారు తుది దశలో ఇంతటి షాక్ ఇవ్వటం వెనక సర్కారు హ్యాండ్ లేకుండా సాధ్యం అవుతుందా?. ఇప్పటివరకూ ఎన్నోసార్లు సమీక్షలు జరిపిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అగ్రిగోల్డ్ ఆస్తుల్లో ‘హాయ్ ల్యాండ్’ ఉందో లేదో తెలియదా?. కేంద్రంలో మోడీ చేసే కుంభకోణాలను క్షణాల్లో కనిపెట్టే కుటుంబరావుకు జాబితా నుంచి హాయ్ ల్యాండ్ జారిపోయిందని ఇప్పటివరకూ కనిపెట్టలేకపోయారా?.

కనిపెట్టి కూడా మౌనంగా ఉండిపోయారా?. ఫోరెన్సిక్ ఆడిట్ జరిగినప్పుడు అత్యంత కీలకమైన సుమారు 500 కోట్ల రూపాయల విలువైన ఆస్తి గల హ్యాయ్ లాండ్ ఆ కంపెనీది కాదని చెప్పటంలో ప్రభుత్వ పాత్ర లేదా?. ఈ అంశంపై కోర్టు కేవలం హెచ్చరికతోనే వదిలేస్తుందా? లేక బాధ్యులను గుర్తించి చర్యలకు ఆదేశిస్తుందా? వేచిచూడాల్సిందే. డిపాజిట్ దారులు ఆందోళన చేసినప్పుడల్లా త్వరలోనే న్యాయం చేస్తామని..అంతా కొలిక్కి వస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావులకు ఆస్తుల జాబితాలో ‘హాయ్ ల్యాండ్’లేదనే విషయం తెలియలేదంటే ఎవరైనా నమ్ముతారా?. అసలు ఈ స్కామ్ లోనే సర్కారు భారీ స్కామ్ కు తెరతీసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story
Share it