Telugu Gateway
Telangana

కాంగ్రెస్ అభ్యర్ధులకూ చంద్రబాబే సీట్లు కేటాయిస్తున్నారు

కాంగ్రెస్ అభ్యర్ధులకూ చంద్రబాబే సీట్లు కేటాయిస్తున్నారు
X

టీఆర్ఎస్ విమర్శల దాడి పెంచింది. ఎప్పటిలాగానే టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడినే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థుల సీట్ల కేటాయింపు చంద్రబాబు కనుసన్నల్లో జరుగుతోందని మంత్రి కెటీఆర్ ఆరోపించారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిని తిరుపతికి ధీటుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఒకే విడతలో రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ఆయన ఆదివారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మీడియాతోనూ మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న పింఛన్‌ను రూ.2016 పెంచుతామని, పింఛన్‌ వయోపరిమితిని 58 ఏళ్లకు తగ్గించబోతున్నామని , నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి కల్పించబోతున్నామని తెలిపారు. దేశంలో రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని చెప్పారు.

రైతుల పంట సాయాన్ని ఎకరానికి రూ.8 వేల నుంచి 10 వేలకు పెంచుతామని తెలిపారు. ముసలి నక్క కాంగ్రెస్‌- గుంట నక్క చంద్రబాబు ఒక్కటై మహాకూటమి పేరుతో మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణాలో ప్రాజెక్టులను ఆపడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గొంగిడి సునీత మరోసారి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని అన్నారు. త్వరలోనే రాయగిరి వరకు మెట్రో రైల్‌ రాబోతోందని వెల్లడించారు. ఆలేరు నియోజకవర్గంలో లక్షా 70 వేల ఎకరాలకు కాళేశ్వం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు అందిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 100 స్థానాలు గెలిచి, కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలిపారు. అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే టీఆర్‌ఎస్‌ను మళ్లీ గెలిపించాలని కోరారు.

Next Story
Share it