Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుకు ఛాన్స్ ఉంటే కోర్టులు రద్దు చేస్తారేమో!

చంద్రబాబుకు ఛాన్స్ ఉంటే కోర్టులు రద్దు చేస్తారేమో!
X

ఐటి దాడులు చేయవద్దు..సీబీఐకి ఎంట్రీ లేదు

ఏపీ రాష్ట్రమా? లేక ప్రత్యేక దేశమా?

ఏపీ ప్రభుత్వం ప్రజలకు ఏమి సంకేతం పంపదలచుకుంది? రాష్ట్రంలో ఐటి దాడులు చేయకూడదు. సీబీఐ కేసులు పెట్టకూడదు. విచారణ చేయకూడదు? అసలు ఏపీలోకి సీబీఐకి ఏంట్రీనే లేదు. చట్టంలో లొసుగులను ఆసరా చేసుకుని ఓ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి జీవో ఇవ్వొచ్చా?. ఆంధ్రప్రదేశ్ ఓ రాష్ట్రమా? లేక ప్రత్యేక దేశమా?. అంటే ఏపీలో పన్నులు కట్టకుండా ఎవరైనా అడ్డగోలుగా ఎంతైనా సంపాదించుకోవచ్చా?. ప్రభుత్వ సొమ్మును ఇష్టానుసారం దోపిడీ చేసినా సీబీఐ కేసులు పెట్టకూడదా?. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్రాలు తమకు నచ్చినట్లు వాడుకుని..దుర్వినియోగం చేసి..కేసులు పెట్టాలంటే మాకూ ఏసీబీ ఉంది..అది మేం చెప్పినట్లే చేస్తుంది అంటే కేంద్రం మౌనంగా చూస్తూ ఊరుకుంటుందా?. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అసలు తమ రాష్ట్రంలో సీబీఐ విచారణకు అంగీకరించటం. ఐటి దాడులకు అనుమతించటం. ఐటి అధికారులు వస్తే పోలీసులను పెట్టి అరెస్టు చేస్తాం? తొలి విడత వాళ్లకు భద్రతా ఉపసంహరిస్తాం. అప్పటికీ వినకపోతే అడుగుపెట్టిన వెంటనే అదుపులోకి తీసుకుంటాం అని చెబుతారా?.

సీబీఐకి ఇప్పుడు కొత్తగా చెదలు పట్టలేదు. కాంగ్రెస్ జమానాలోనూ ఇప్పటి విపక్షాలు అన్నీ అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కాదు..కాంగ్రెస్ బ్యూరో ఆప్ ఇన్వెస్టిగేషన్ గా మారిపోయిందని విమర్శించారు. అందులో ప్రస్తుత అధికార టీడీపీ కూడా ఉంది. కాకపోతే సీబీఐ ఇప్పుడు ఒకింత ఎక్కువ బజారున పడి వచ్చు?. అంత మాత్రాన అసలు మా రాష్ట్రంలోకి సీబీఐ ప్రవేశించటానికి లేదు.. మా కేసులు మేమే చూసుకుంటాం అంటే సాధ్యం అవుతుందా?. అసలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఇలాంటి సలహాలు ఇస్తున్నది ఎవరు?. ఐటి దాడులకు వచ్చే అధికారులకు భద్రత ఉపసంహరించుకుంటామని చెప్పటం ఏంటి?. ఇప్పుడు ఏకంగా చట్టం ప్రకారం స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అయిన సీబీఐ ను ఏపీలోకి రానివ్వం అనేలా జీవో జారీ చేయటం ద్వారా ప్రభుత్వం ఎలాంటి సంకేతాలు పంపుతోంది?. ఏపీ జీవో తెచ్చిన తరహాలోనే కేంద్రం చట్టంలో సవరణ చేసి సీబీఐ అధికారాలను మార్చలేదా?. ఎందుకు ఏపీ ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది?. ఏపీ ప్రభుత్వానికి అధికారం ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోర్టులను కూడా రద్దు చేస్తూ ఓ జీవో తెచ్చేవారని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించటం విశేషం.

Next Story
Share it