Telugu Gateway
Politics

టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి కృష్ణయ్య జంప్

టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి కృష్ణయ్య జంప్
X

తెలంగాణ ఎన్నికలు ఎన్నో కొత్త సన్నివేశాలను చూపిస్తున్నాయి. ఉదయం ఓ పార్టీ..సాయంత్రానికి మరో పార్టీ. చేరిన పార్టీలో వెంటనే టిక్కెట్. ఇలాంటి వింతలెన్నో. టీడీపీ తరపున గత ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన బీసీ సంక్షే మ సంఘం జాతీయ అధ్యక్షు డు ఆర్‌. కృష్ణయ్య ఒక్క దెబ్బలో కాంగ్రెస్ కు జంప్ అయిపోయారు. అంతే కాదు..ఆయనకు కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా మిర్యాలగూడ అసెంబ్లీ సీటు కేటాయించింది. ఇది కాంగ్రెస్ కు రాజకీయంగా లాభించే పరిణామంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్‌. కృష్ణయ్య ఆదివారం సాయంత్రం టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఆరుగురు సభ్యులతో ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనకు చోటు కల్పించింది. తెలంగాణలో ఇఫ్పుడు కాంగ్రెస్, టీడీపీ పొత్తులో సాగుతున్నందున టీడీపీ కూడా ఈ అంశంపై స్పందించే అవకాశమే లేదు. బీసీలకు తక్కువ స్థానాలను కేటాయించామన్న అపవాదును పోగొట్టుకోవడంతోపాటు సమస్యాత్మకంగి మారిన మిర్యాలగూడ సీటు వివాదాన్ని పరిష్కరించుకోవడం కోసం కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మకంగా ఆ స్థానాన్ని కృష్ణయ్యకు కేటాయించిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే ఇదే స్థానానికి టీజేఎస్‌ కూడా విద్యాధర్‌రెడ్డికి బీ ఫారం ఇవ్వడం విశేషం. కాంగ్రెస్ పార్టీ తాజాగా కేటాయిం చిన ఆరింటితో కలుపుకొని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటివరకు 94 మంది అభ్యర్థులకు సీట్లను కేటాయించింది. తాజా జాబితాలో నలుగురు బీసీలకు అవకాశం లభించింది. రాష్ట్రంలోని 119 స్థానాలకుగాను మహాకూటమి తరఫున ఇప్పటివరకు కాంగ్రెస్‌ 94, టీడీపీ 13, టీజేఎస్‌ 4, సీపీఐ 3 చోట్ల కలిపి 114 మంది అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాయి.

కాంగ్రెస్‌ జాబితా..

మిర్యాలగూడ – ఆర్‌. కృష్ణయ్య (బీసీ)

సికింద్రాబాద్‌ – కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ (బీసీ)

నారాయణపేట్‌ – వామనగారి కృష్ణ (బీసీ)

నారాయణఖేడ్‌ – సురేష్‌ కుమార్‌ షెట్కర్‌ (బీసీ)

కోరుట్ల – జువ్వాడి నర్సింగ్‌రావు (వెలమ)

దేవరకద్ర – డాక్టర్‌ పవన్‌కుమార్‌రెడ్డి (రెడ్డి)

Next Story
Share it