Telugu Gateway
Politics

ఆంధ్రా ప్రజలకు అండగా ఉంటాం

ఆంధ్రా ప్రజలకు అండగా ఉంటాం
X

‘ఆంధ్రాలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. మీరు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు చేయవద్దు. రెండు రాష్ట్రాల నాయకులు, పార్టీల మధ్య వైరుధ్యాలు ఉంటాయి. వాటిని ప్రజలు, వ్యక్తులు, వ్యవస్థల మధ్య వైరుధ్యాలుగా చూడకూడదు’ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఉండే కోస్తా, రాయలసీమ ప్రజలకు తాను వ్యక్తిగతంగా అండగా ఉంటానని తెలంగాణ ఐటి, మునిసిపల్ శాఖ మంత్రి కెటీఆర్ ఆదివారం నాడు హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో వ్యాఖ్యానించారు. అంతే కాదు..అమరావతి నిర్మాణానికి తెలంగాణ తరపున సీఎం కెసీఆర్ వంద కోట్ల రూపాయలు ఇద్దామని అనుకున్నారని..ప్రధాని మోడీ కేవలం మట్టి..నీళ్ళు ఇవ్వటంతో ఏమీ చేయలేకపోయినట్లు వెల్లడించారు. హైదరాబాద్ అందరికీ సురక్షితమైన నగరం అని వ్యాఖ్యానించారు. తమను నమ్మి మరోసారి అధికారం ఇస్తే అభివృద్ధి పనులు పూర్తిచేస్తామన్నారు. హైదరాబాద్‌లో డ్రైనేజీ, రోడ్ల సమస్య లేకుండా చేస్తామని తెలిపారు. నగరంలో శాంతిభద్రత, ఫ్లైఓవర్లు, మురికి కాలువలు, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు.

2014లో హైదరాబాద్‌లో టీఆర్ఎస్ పట్ల చాలా అనుమానాలు ఉండేవని, అయితే ఈ నాలుగేళ్ల పాలనలో వాటన్నింటినీ పటాపంచలు చేశామన్నారు. దాని ఫలితమే గ్రేటర్ ఎన్నికల్లో అన్ని ప్రాంతాల వారు టీఆర్ఎస్‌కు బ్రహ్మరథం పట్టారని పేర్కొన్నారు. ప్రాంతాలకతీతంగా పాలన సాగించామని చెప్పారు. తెలంగాణ వచ్చేంత వరకే గొడవ అని, ఈ నాలుగేళ్లలో ఎక్కడా ప్రాంతీయ వివక్ష జరగలేదని కేటీఆర్ తెలిపారు. 67 ఏళ్లలో హైదరాబాద్‌ ఎలా ఉండేదో.. ఈ నాలుగేళ్లలో ఎలా ఉందో చూడాలని ప్రజలను కోరారు. కేసీఆర్ మాట్లాడిన మాటలు.. ఇక్కడి సెటిలర్లను ఉద్దేశించినవి కావని, టీడీపీ, చంద్రబాబును ఉద్ధేశించి మాట్లాడరని వివరణ ఇచ్చారు. రాజకీయాల్లో విమర్శలు సహజం అని పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల సమయంలో ‘నువ్వు లోకలా..? నేను లోకలా? అంటూ లోకేష్ తనకు సవాల్ విసిరారని గుర్తుచేశారు. ప్రజల్లో పొరపొచ్చాలు లేవని, పార్టీల పరంగా ఉంటాయని పేర్కొన్నారు.

Next Story
Share it