Telugu Gateway
Telangana

ఎంపీ కవిత అఫిడవిట్ పై వివాదం!

ఎంపీ కవిత అఫిడవిట్ పై వివాదం!
X

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయ, నిజామాబాద్ ఎంపీ కవిత ఎన్నికల ‘అఫిడవిట్’కు సంబంధించిన వివాదం ఒకటి ఇప్పుడు తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ అఫిడవిట్ చక్కర్లు కొడుతోంది. నిబంధనల ప్రకారం పోటీచేసే అభ్యర్ధులు ఎన్నికల అఫిడవిట్ లో పిల్లల వివరాలను కూడా పొందుపర్చాల్సి ఉంటుంది. వాళ్ళు మైనర్స్ అయినా డిపెండెంట్స్ కాలమ్ లో ఆ వివరాలు ఇవ్వాలి. కానీ ఆ కాలమ్ లో కవిత ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. వాస్తవానికి కవితకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె ఈ వివరాలు ఎందుకు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొనలేదన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గత ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే కవిత తన అఫిడవిట్ లో పిల్లల వివరాలను పేర్కొనకపోవటంపై ఇప్పుడు వివాదం నడుస్తోంది. ఈ అంశాన్ని ఎవరు తెరపైకి తెచ్చారో తెలియదు కానీ..ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నికల అఫిడవిట్ లో పిల్లల వివరాలు అందించకపోవటం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని ఎన్నికల నిపుణులు చెబుతున్నారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునేందుకు వీలుగా పాత రికార్డులను తవ్వితీస్తున్నారు. ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ ను తనిఖీ చేయగా..సర్కులేషన్ లో ఉన్న అఫిడవిట్ వివరాలే అందులో కూడా ఉన్నాయి.

Next Story
Share it