Telugu Gateway
Telangana

బిజెపి దూకుడుపై కెసీఆర్ అసహనం!

బిజెపి దూకుడుపై కెసీఆర్ అసహనం!
X

తెలంగాణలో బిజెపి దూకుడుపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ అసహననంతో ఉన్నారా?. అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఏ సర్వే చూసిన వంద సీట్లు తగ్గటం లేదని చెప్పుకునే టీఆర్ఎస్ నేతలు కెసీఆర్ చెబుతున్నట్లు ఒక శాతం ఓటు బ్యాంకు కూడా లేని టీడీపీ కాంగ్రెస్ తో జటకట్టడంతో ఎందుకు టెన్షన్ కు గురవుతున్నారు. మహాకూటమి టీఆర్ఎస్ లో వణుకు పుట్టిస్తున్నది అన్నది ఎవరూ కాదనలేని సత్యం. బిజెపి ఇఫ్పటికే 38 సీట్లను ఖరారు చేసింది. మరో పది సీట్లకూ అభ్యర్ధులు సిద్ధం అయ్యారు. అంటే దాదాపు 50 సీట్లకు అభ్యర్ధులు ఇప్పటికే రెడీ. వరస పెట్టి కేంద్ర మంత్రులు హైదరాబాద్ లో పర్యటించటం, అమిత్ షా టూర్ లు..బిజెపి నేతల వ్యాఖ్యలు కెసీఆర్ కు మరింత చికాకు పెట్టిస్తున్నాయని చెబుతున్నారు. తెలంగాణ ముందస్తు ఎన్నికలకు కేంద్రంలోని మోడీ సర్కారు అందదండలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు సహకరిస్తే..పార్లమెంట్ ఎన్నికల్లో తాము బిజెపి కోసం పనిచేస్తామని కెసీఆర్ హామీ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది.

అయితే కెసీఆర్ తాజా ఢిల్లీ పర్యటనలో ఇది కూడా ఓ కీలక అంశంగా ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా బిజెపి దూకుడు గా వెళితే పార్లమెంట్ ఎన్నికల సమయంలో తాము సహకారం అందించటం కష్టం అవుతుందనే సంకేతాలు కేంద్రంలోని పెద్దలకు కెసీఆర్ పంపినట్లు చెబుతున్నారు. బిజెపికి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న ఓ వర్గం వారు తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారు. బిజెపి ఇదే దూకుడు కంటిన్యూ చేస్తే ఇది మరింత దెబ్బతీస్తుందనే ఆందోళన కెసీఆర్ లో ఉందని చెబుతున్నారు. బిజెపి సీట్లు గెలుస్తుందనే భయం కంటే..తమ ఓట్లకు గండికొడుతుందనే ఆందోళనే కెసీఆర్ లో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మహాకూటమితో ఎదురయ్యే సవాళ్ళు ఒకవైపు..బిజెపి కూడా స్పీడ్ పెంచితే తమకు నష్టం చేస్తాయనేది టీఆర్ఎస్ క్యాంప్ ఆందోళన. అందుకే బిజెపి దూకుడుకు కళ్ళెం వేయించాలనే ప్రతిపాదనను కెసీఆర్ ఢిల్లీ పెద్దల ముందు పెట్టినట్లు సమాచారం. మరి భవిష్యత్ లో బిజెపి ఎలా వ్యవహరిస్తుంది అన్నది వేచిచూడాల్సిందే. ఓ వైపు కెసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు చేస్తుంటే..కెసీఆర్ తనయుడు, మంత్రి కెటీఆర్ మాత్రం మీరు అదేమీ పట్టించుకోవద్దంటూ హైదరాబాద్ లో ని ఆంధ్రా ప్రాంత వాసులను బుజ్జగిస్తున్నారు. మరి వీరి ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో తెలియాలంటే డిసెంబర్ 11 వరకూ వేచిచూడాల్సిందే.

Next Story
Share it