Telugu Gateway
Telangana

కెసీఆర్ నియోజ‌క‌వ‌ర్గంలో క‌ల‌కలం

కెసీఆర్ నియోజ‌క‌వ‌ర్గంలో క‌ల‌కలం
X

తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏమి జ‌రుగుతోంది?. ఇదే ఇప్పుడు టీఆర్ ఎస్ నేత‌ల్లో చ‌ర్చ‌నీయాంశం. గ‌త కొన్ని రోజులుగా పార్టీ నేత‌లు అధిష్టానంపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. స్థానిక నేత‌లు వ‌ర‌స పెట్టి కాంగ్రెస్ పార్టీలోకి చేర‌టం..మ‌ళ్లీ వెంట‌నే వారిని ఏదో ఒక ర‌కంగా పార్టీలోకి తీసుకురావ‌టం. ఇలా జ‌రుగుతోంది. తాజాగా గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే న‌ర్సారెడ్డి కూడా పార్టీని వీడ‌టానికి రెడీ అయిపోయారు. విష‌యం తెలియ‌టంతో టీఆర్ఎస్ అధిష్టానం వెంట‌నే ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. న‌ర్సారెడ్డి ప్ర‌స్తుతం రాష్ట్ర రోడ్డు డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ గా ఉన్నారు. న‌ర్సారెడ్డి పార్టీని వీడ‌టానికి రెడీ అయిపోవ‌టం, స్థానిక నేత‌ల్లో పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి కెసీఆర్ పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతుండ‌టంతో ఎన్నిక‌ల ఫలితం ఎలా ఉండ‌బోతుందా? అన్న టెన్ష‌న్ పార్టీ నేత‌ల్లో ఉంది. త‌మ‌కు పార్టీ నాయ‌క‌త్వం నుంచి క‌నీస గౌర‌వం ద‌క్క‌లేద‌ని..గుర్తింపు ఉండ‌టంలేద‌ని స్థానిక నాయ‌కులు వాపోతున్నారు.

ఈ సారి ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని కాంగ్రెస్ పార్టీ నేత ఒంటేరు ప్ర‌తాప‌రెడ్డి విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆయ‌న పావులు క‌దుపుతున్నారు. కెసీఆర్ మాత్రం ఈ నియోజ‌క‌వ‌ర్గం బాధ్య‌త‌ల‌ను పూర్తిగా మంత్రి హ‌రీష్ రావుకు అప్ప‌గించారు. అయినా స‌రే తాజాగా చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు టీఆర్ ఎస్ శ్రేణుల్లోనే అనుమానా బీజాలు నాటేలా చేస్తున్నాయి. గ‌త కొంత కాలంగా కెసీఆర్ రెండ‌వ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కూడా పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఓ వైపు వంద సీట్లు వ‌స్తాయ‌ని చెప్పుకుంటూ కెసీఆర్ గ‌జ్వేల్ నుంచి కాకుండా మ‌రో చోట నుంచి బ‌రిలోకి దిగితే మాత్రం త‌ప్పుడు సంకేతాలు పంపే అవ‌కాశం ఉంద‌ని ఓ సీనియ‌ర్ నేత వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నుంచి స‌స్పెన్ష‌న్ కు గురైన న‌ర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర‌బోతున్నారు.

Next Story
Share it