Telugu Gateway
Telangana

కెసీఆర్ ను ‘చంద్రబాబే’ గెలిపించాలా?!

కెసీఆర్ ను ‘చంద్రబాబే’ గెలిపించాలా?!
X

రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపామని చెప్పుకుంటున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ కు ఇప్పుడు ‘చంద్రబాబే’ ఓ ఆయుధంగా దొరికారా?. టీడీపీ, కాంగ్రెస్ పొత్తునే కెసీఆర్ నమ్ముకున్నారా?. అంటే అవుననే అంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. గత ఎన్నికల తరహాలోనే ఈ సారి కూడా ‘సెంటిమెంట్’ను నమ్ముకుని రాజకీయంగా లబ్దిపొందేందుకు కెసీఆర్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. చంద్రబాబుపై కెసీఆర్ తిడుతున్న తిట్లు అప్పుడే అయిపోలేదని...ఎన్నికల ప్రచారం ముగిసే వరకూ ఈ తిట్లు అలా కొనసాగుతూనే ఉంటాయని టీఆర్ఎస్ కు చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అది అంతా ఓ పథకం ప్రకారం సాగుతున్న వ్యవహారమే అని చెబుతున్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినా కూడా కేసును అటకెక్కించటమే కాకుండా...అట్టహాసంగా నిర్వహించిన ఆయుత చండీయాగానికి చంద్రబాబును కరకట్టకెళ్ళి మరీ ఆహ్వానించి వచ్చిన కెసీఆర్ తర్వాత చంద్రబాబును కౌగిలించుకున్న సంగతి తెలిసిందే. అన్ని ఆధారాలు ఉన్నా..ఓటుకు నోటు కేసును నీరుగార్చి..ఇప్పుడు కొత్తగా ఓటుకు నోటు కేసులో నువు దొరికిన దొంగవు కావా? అని కెసీఆర్ బహిరంగ సభల్లో ప్రశ్నిస్తున్నారు.

మరి దొరికిన దొంగను ప్రభుత్వం ఏమి చేసింది అంటే కెసీఆర్ దగ్గర సమాధానం ఉందా?. అంటే కేవలం రాజకీయ అవసరాల కోసం ఈ కేసును అలా అట్టిపెట్టుకున్నట్లు అర్థం అవుతుందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. చంద్రబాబుపై తెలంగాణ ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంటుంది?. దాన్ని మరింత రెచ్చగొట్టి..ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా వెళ్ళే ఓటును చంద్రబాబును బూచిగా చూపించి..కాంగ్రెస్ వైపు మళ్ళకుండా చేయటమే కెసీఆర్ ప్లాన్ అని చెబుతున్నారు. చంద్రబాబును తిట్టడం వల్ల ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారి ఓట్లు పడకపోయినా పర్వాలేదు...ఈ వ్యక్తిగత ఎటాక్ ద్వారా తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ పెంచేసి గుండుగుత్తగా స్థానికుల ఓట్లు దక్కించుకోవాలని చూస్తున్నారని చెబుతున్నారు. అయితే మరి కెసీఆర్ ప్లాన్ ఎంత మేరకు వర్కవుట్ అవుతుందో వేచిచూడాల్సిందే. ఎన్నికల ప్రచారం ముగిసే వరకూ తెలంగాణ ప్రజలు కెసీఆర్ నుంచి పరుషమైన మాటలు వినాల్సిందేనని..ఇది అంతా పక్కా ప్లాన్ తో సాగుతుందని చెబుతున్నారు. అయితే కెసీఆర్ బహిరంగ సభల్లో చేస్తున్న విమర్శలు శ్రుతిమించాయనే అభిప్రాయం ఎక్కువ మందిలో వ్యక్తం అవుతోంది.

Next Story
Share it