Telugu Gateway
Telangana

సాధ్యంకాదన్న హామీనే మేనిఫెస్టోలో పెట్టిన కెసీఆర్

సాధ్యంకాదన్న హామీనే మేనిఫెస్టోలో పెట్టిన కెసీఆర్
X

రైతులకు మళ్ళీ లక్ష రూపాయల రుణమాఫీ

నిరుద్యోగ భృతి 3016 రూపాయలు

రైతు బంధు సాయం 8000 నుంచి 10వేలకు పెంపు

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కెసీఆర్ తానే సాధ్యం కాదన్న హామీని ఏకంగా మేనిఫెస్టోలో పెట్టారు. అసెంబ్లీ రద్దు తర్వాత మీడియాతో మాట్లాడిన కెసీఆర్ నిరుద్యోగ భృతి ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. ఎంత మందికి భృతి ఇస్తారు..అసలు నిరుద్యోగుల లెక్కలు ఉన్నాయా? అని మీడియా సాక్షిగా ప్రశ్నించారు. కానీ ఇప్పుడు ఏకంగా పార్టీ మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. నిరుద్యోగికి నెలకు 3016 రూపాయలు అందిస్తామని తెలిపారు. సమగ్ర సర్వే ఆధారంగా ఈ జాబితా తయారు చేస్తామని..ఇది చాలా క్లిష్టమైన పని అని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే లక్షలోపు రుణమాఫీతో పాటు ప్రస్తుత ఫించన్లు రెట్టింపు చేస్తామని తెలిపారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఎన్నికల ప్రణాళిక కమిటీ నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించారు.

తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించినప్పటి పరిస్థితులుకు తాజా పరిస్థితులకు ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. ఎలక్షన్‌ అంటే చాలా మందికి పొలిటికల్‌ గేమ్ అని.. తమకు మాత్రం ఓ టాస్క్‌ అని తెలిపారు. 2020 వరకు కొంచెం అటుఇటుగా కోటి ఎకరాలకు నీళ్లు వస్తాయని స్పష్టం చేశారు. అప్పటి వరకు అన్ని ప్రాజెక్టులు పూర్తయి నీళ్లు అందుతాయన్నారు. రైతాంగానికి అండగా ఉండే మిషన్‌ కాకతీయ, రైతు బంధు పథకం, రైతు భీమా పథకాలతో పాటు కరెంట్‌ సమస్యలు తీర్చామన్నారు. అలాగే ఎరువులు సకాలంలో అందిస్తున్నామని తెలిపారు. రైతు బంధు పథకంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు ప్రశంసలు కురిపిస్తున్నారని చెప్పారు. రైతు భీమా పథకంతో ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా రూ.5 లక్షల నష్టపరిహారం అందిస్తున్నామని తెలిపారు.

రైతు సమన్వయ సమితులు కూడా ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్తులో రైతులు రాజులు కావాలంటే... ఇంకొన్ని రోజులు ఆదుకోవాలని, రైతులు అప్పుల నుంచి భయటపడి తమ పెట్టుబడి తామే పెట్టుకునే వరకు టీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో మొత్తం 45 లక్షల మంది రైతులు అప్పులు తీసుకున్నారని, ఇందులో రూ.1 లక్ష లోపు తీసుకున్నవారు 42 లక్షలున్నారని తెలిపారు. ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే మళ్లీ ఆ లక్ష రూపాయలను ఒక విడతలోనే రుణమాఫీ చేస్తామని కేసీఆర్‌ పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించారు. అదే సమయంలో రైతు బంధు పథకం కింద సాయాన్ని 4000 నుంచి 5000 రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు. దీంతో ఏటా రైతులకు పది వేల రూపాయల సాయం అందనుంది.

Next Story
Share it